అదిగో ఏపీ రాజధాని పాయింట్

ఏపీ రాజధాని పాయింట్ ఖరారైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడ కేంద్రంగా రాజధాని ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినా ఆయన ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందో చెప్పలేదు. అయితే ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తుల అంతర్గత సమాచారం ప్రకారం రాజధాని కేంద్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నీరుకొండను ఎంపిక చేస్తారని సమాచారం. ఈ పాయింట్ మంగళగిరికి పశ్చిమం వైపున అమరావతికి వెళ్లే దారిలో మంగళగిరికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పాయింట్‌ను ఆనుకుని రాజధాని కృష్ణానదికి ఇరువైపులా ఉండబోతోంది. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి-పెనుమాక, మంగళగిరి మండలం నీరు కొండ, తుళ్లూరు, అమరావతి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రాజధాని ఉండబోతోంది.

అలాగే కృష్ణానదికి ఎడమవైపు కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కూడా రాజధాని విస్తరించి ఉండనుందని టాక్. అక్కడ ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు భూముల సర్వే జరుగుతోంది. కృష్ణా నదిలో ఉన్న భవానీద్వీపాన్ని, ఉండవల్లి గుహాలను పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ టెంపుల్ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా ఉండవల్లి గుహలకు రోప్‌వేను ఏర్పాటు చేయనున్నారు. భవానీద్వీపానికి మరింత హంగులు సమకూర్చనున్నారు. రాజధానిలో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్ గుంటూరు జిల్లాలో ఉండే అవకాశం ఉండగా, హైకోర్టు, ఇతర పరిపాలనా భవనాలు కృష్ణా జిల్లాలో ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

ప్రతిపాదిత రాజధాని ప్రాంతం ప్రకాశం బ్యారేజీకి ఐదారు కిలోమీటర్లు ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు 35 కిలోమీటర్లు దిగువన ఉండబోతోంది. ఇక ప్రకాశం బ్యారేజీ-పోలవరం కుడికాలువ అనుసంధానం ఇప్పటికే పూర్తయ్యింది. అక్కడ ప్రాజెక్టు నిర్మించడమే ఆలస్యం. దీంతో నీటికి కొదవే ఉండదు. అలాగే విజయవాడ చుట్టుపక్కల కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేసే రింగురోడ్డుతో పాటు 26 కిలోమీటర్ల మెట్రోరైల్ లైన్, రాజధానితో చుట్టు పక్కల ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్ ట్రైన్స్ ఏర్పాటు వల్ల రాజధానికి మరింత శోభ రానుంది.