ఒక లైలా కోసం: ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ

సినిమా: ఒక లైలా కోసం

అక్కినేని నాగచైతన్య – పూజాహెగ్డే జంటగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ఒక లైలా కోసం. అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సంవత్సరం ఇప్పటికే మనం, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో నటించి జోరుమీదున్న చైతన్య లైలాతో మూడోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రేమ కథా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా శుక్రవారం(ఈ నెల 17న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే మార్మోగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమా కథ, కథనం, హీరో, హీరోయిన్ల విశేషాలతో పల్లిబఠాని.కామ్ మీకు అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ.

కథ, కథనం:
అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు ఓ అయ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెకేమో అతడంటే అస్సలు ఇష్టం ఉండదు. జీవితంలో చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను.. ఒక వేళ చేసుకుంటే నీకు విషం పెట్టి చంపేస్తానని ఆమె అంటుంది. నాకు అంత అదృష్టం కూడానా నీ చేతుల్లో చచ్చిపోయేందుకు నీతో తాళి కట్టించేందుకు కూడా తాను సిద్ధమేనని అతడు అంటాడు. ఇంత అందంగా ఉన్న నీకు ఎవ్వరు ప్రపోజ్ చేయలేదంటే ఖచ్చితంగా నీలో ఏదో లోపం ఉందంటూ అతడు ఆమెను ఆట పట్టిస్తాడు. 

కాలేజ్ నేపథ్యంలో సాగుతున్న ఈ ప్రేమకథలోకి విలన్లు ఎలా ఎంటరయ్యారు. చివరకు హీరో రౌడీల ఆటకట్టించి తన ప్రేమను ఎలా నెగ్గించుకున్నారన్నదే క్లుప్తంగా చిత్ర కథాంశం.

సంగీతం:
అనూప్ రూబెన్స్ సంగీతం అందిచిన పాటలు చాలా బాగున్నాయి. ఇప్పటికే ఎక్కడపడితే అక్కడ మార్మోగిపోతున్నాయి. చిత్రం ట్రిఫుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక కూడా జరుపుకుంది. ఈ సంవత్సరం విడుదలైన నాగచైతన్య చిత్రాలు మనం, ఆటోనగర్ సూర్యకు కూడా అనూపే సంగీతం అందించాడు. ఈ సంవత్సరం వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మ్యూజికల్ చిత్రం అవుతుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. ట్రైలర్స్‌లో విడుదలైన సీన్లలో నేపథ్య సంగీతం కూడా సూపర్బ్‌గా ఉంది.

బ్యానర్/నిర్మాత:
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జునే స్వయంగా తన కుమారుడితో ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా గ్రాండ్‌గా శుక్రవారం ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మంచి థియేటర్లు ఈ సినిమాకు దొరకడం కూడా ఫ్లస్ పాయింట్. సినిమాపై ఉన్న నమ్మకంతో నాగార్జున సినిమాను రెండుసార్లు చూసి బడ్జెట్ పెంచి మరీ హై క్వాలిటీతో తెరకెక్కించడమే సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో తెలుస్తోంది. సినిమా విజయంపై నాగ్ పూర్తి నమ్మకంతో ఉన్నట్టు సమాచారం.

దర్శకత్వం:
యువ కథానాయకుడు నితిన్‌తో తొలి ప్రయత్నంతోనే గుండుజారి ఘల్లంతయ్యిందే లాంటి విభిన్న ప్రేమకథా చిత్రంతో తానేంటో నిరూపించుకున్న కొండా విజయ్‌కుమార్ ఈ సున్నిత ప్రేమకథను తెరకెక్కించారు. సినిమా ట్రైలర్స్ విడుదలైనప్పటి నుంచి ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. పాటలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కొండా విజయ్‌కుమార్ ఈ సినిమాలో ప్రతి అంశాన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్ టైప్‌లో చిత్రీకరించారని చిత్రబృందం చెపుతోంది. సినిమాకు కథ, కథనంతో పాటు దర్శకత్వం ఈ మూడు విభాగాలను ఆయనే డీల్ చేశారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆయన ధీమాతో ఉన్నారు.

చివరగా…
ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు అవరోధాలు ఎదుర్కొని శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సినిమా విజయం సాధించి నాగచైతన్యకు మంచి లైఫ్ ఇస్తుందని ఆశిస్తూ పల్లిబఠాని.కామ్ తరపున మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.