నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు రెండ్రోజులే

తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలతో నెంబర్ 1 స్థానం సంపాదించుకున్న మా టెలివిజన్ అధినేత కింగ్ నాగార్జున బుల్లితెరపై నిర్వహిస్తున్న షో ‘మీలో ఎవరు కోటిశ్వరుడు’. కోటి రూపాయలు గెలుచుకోవాలన్న కలని ఎవరైనా నిజం చేసుకోవచ్చనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. ఈ షోని మాటీవీ యాజమాన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో  ఈ షో జరుగుతుంది. బిగ్ సినర్జీ ఈ కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. 

బిగ్ సినర్జీ ప్రతినిధి ఈ కార్యక్రమ విశేషాల గురించి మాట్లాడుతూ… ‘ఈ కార్యక్రమం ఎంపిక పద్ధతి మొత్తం విశ్వసనీయ విధానంలో జరుగుతుంది. కోటి రూపాయల బహుమానం అందించే ఈ షోలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశముంటుంది. ఏ ఒక్క ప్రశ్నకు ఎస్ఎం.ఎస్ పంపినా హాట్ సీట్ కి చేరుకొనే అవకాశం రావచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు పంపేందుకు ఫోన్ లైన్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి అని ఎంతో ఆసక్తిగా వేచి చూసిన ప్రేక్షకులు ఫోన్ లైన్స్ ఓపెన్ అయిన క్షణం నుంచి అనూహ్యంగాం స్పందించారు. మాటీవీ తెరపైన ప్రశ్న కనిపించగానే వేల సంఖ్యలో ప్రేక్షకులు స్పందించి ఎస్ఎంఎస్ లు పంపారు. రాత్రి 8 గంటలకు మాటీవీలో ప్రశ్నలు వస్తాయి. జవాబులు పంపే అవకాశం మే 1 రాత్రి 7గం.ల వరకు మాత్రమే ఉంటుంది’. అని అన్నారు.