పాపం.. వెంక‌టేశ్ న‌లిగిపోతున్నాడు..

వెంక‌టేశ్ మ‌ళ్లీ పాత రూట్ లోకి వ‌చ్చేసాడు. బాబు బంగారం టీజ‌ర్ చూసిన త‌ర్వాత సినిమా క‌చ్చితంగా హిట్ అనే న‌మ్మ‌కం వెంకటేశ్ లోనూ క‌నిపిస్తుంది. చాలా ఏళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ ప‌ర్ ఫెక్ట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ లో చ‌క్క‌గా ఒదిగిపోయాడు విక్ట‌రీ హీరో. మారుతి కూడా వెంకీ ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు బాబు బంగారాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ముందు ఈ సినిమాను జులై 1న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. అయితే అదే రోజు ర‌జినీకాంత్ క‌బాలి కూడా విడుద‌ల కానుంద‌ని తెలియ‌డంతో త‌న గురువుకు దారిచ్చేసాడు వెంక‌టేశ్. నాగ‌వ‌ల్లి సినిమాలో వెంకీకి గురువుగా ర‌జినీనే న‌టించారు మ‌రి. రియ‌ల్ లైఫ్ లోనూ ర‌జినీ త‌న‌కు గురువు లాంటి వాడ‌ని చెబుతాడు వెంక‌టేశ్. అలాంటి మెంట‌ర్ కోసం త‌న సినిమా త్యాగం చేసాడు ఈ హీరో.
శిష్యుడు అంత ప్రేమ‌తో త్యాగం చేస్తే ర‌జినీ మాత్రం మ‌ళ్లీ హ్యాండిచ్చాడు. జులై 1న క‌బాలి వ‌స్తుంది క‌దా అని దానికి దూరంగా జులై 29 ఫిక్స్ చేసుకున్నాడు బాబు బంగారం. ఇందులో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తోంది. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. కానీ జులై 1 నుంచి క‌బాలి త‌ప్పుకుని 22కి క‌న్ఫ‌ర్మ్ అయింది. మ‌ధ్య‌లో జులై 15 అనే టాపిక్ కూడా తెర‌పైకి వ‌చ్చింది. మొత్తానికి ఇప్పుడు జులై 22న రావ‌డం క‌న్ఫ‌ర్మ్.. నిర్మాత క‌ళైపులి ఎస్ థానే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు. క‌బాలికి పాజిటివ్ టాక్ వ‌స్తే రెండు మూడు వారాలు కుమ్మేయ‌డం గ్యారెంటీ. ఇలాంటి టైమ్ లో వారం త‌ర్వాత బాబు బంగారం వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో అని భ‌య‌ప‌డుతున్నాడు వెంకీ.
అప్ప‌టికే రావాల్సిన సినిమాల‌న్నీ వ‌చ్చేస్తాయి క‌దా.. హాయిగా జులై చివ‌ర్లో వ‌ద్దామ‌ని వెంక‌టేశ్ ప్లాన్ చేసుకుంటే.. త‌న ప్లాన్స్ ను క‌బాలి స్పాయిల్ చేస్తున్నాడు. ఆగ‌స్ట్ 12న జ‌న‌తా గ్యారేజ్ రానుంది. బాబు బంగారంకు, ఎన్టీఆర్ సినిమాకు రెండు వారాల గ్యాప్ ఉంటుంది. సినిమా హిట్టైతే ఎలాగూ త‌ర్వాత కూడా వ‌సూళ్లు బాగానే వ‌స్తాయి. అందుకే ఇప్ప‌ట్లో కాకుండా ఏకంగా త‌న సినిమాను జులై చివ‌ర్లోకి తీసుకెళ్లాడు వెంక‌టేశ్. మ‌రి క‌బాలి వేట నుంచి వెంకీ ఎలా త‌ప్పించుకుంటాడో చూడాలి.