2014 రివైండ్: కొత్త హీరోల వెలుగు జిలుగులు

టాలీవుడ్ చరిత్రలో మరో సంవత్సరం కాలగర్భంలో కలిసి పోయింది. ఈ సంవత్సరం టాలీవుడ్‌కు పలువురు కొత్త హీరోలు పరిచయం అయ్యారు. వీరిలో కొందరు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని కలెక్షన్లు కొల్లగొట్టారు. మెగా ఫ్యామిలీ నుంచే ఈ సంవత్సరం ఇద్దరు హీరోలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కొత్త హీరోలు వెండి తెరపై ఎలా మెరిశారో వారి వెలుగు జిలుగులు ఎలా ఉన్నాయో చూద్దాం.

సాయిధరమ్ తేజ్:
ఈ సంవత్సరం వెండి తెరకు పరిచయం అయిన హీరోలలో బాగా సక్సెస్ అయ్యింది సాయిధరమ్ తేజ్. సాయి తొలి సినిమా రేయ్ విడుదల ఆలస్యం కావడంతో ఈ సంవత్సరం నవంబర్ 14న పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో వెండితెరపై ఘనంగా తన ప్రస్థానం ఆరంభించాడు. ఏఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. రెజీనా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా… అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్-దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.

బెల్లకొండ శ్రీనివాస్:
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడుశీను సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. అగ్ర దర్శకుడు వివి.వినాయక్ దర్శకత్వం వహించారు. సమంత కథానాయిక. అయితే తన కుమారుడు వెండి తెరంగ్రేటం ఘనంగా చేయాలనుకున్న సురేష్ భారీ కాస్టింగ్‌తో పాటు టెక్నిషియన్స్‌ను వాడడంతో ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్ అయ్యింది. అయితే రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సినిమా పర్వాలేదనిపించినా ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. శ్రీను ఎంట్రీ మాత్రం గ్రాండ్‌గా జరిగింది. 

వరుణ్‌తేజ్:
మెగా కాంఫౌండ్ నుంచి వచ్చిన మరో హీరో వరుణ్‌తేజ్. నాగబాబు తనయుడు వరుణ్ క్రిస్మస్ సందర్భంగా ఈ సంవత్సరం చివర్లో ముకుందగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. పూజాహెగ్డే కథానాయిక. సినిమా ఓ మోస్తరుగా పర్వాలేదనిపించింది. అయితే అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయితే వరుణ్‌కు తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు పడ్డాయి.

అక్కినేని అఖిల్:
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న అక్కినేని అఖిల్ ఈ సంవత్సరం అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన హిట్ చిత్రం మనంలో చిన్న పాత్రలో చివర్లో తళుక్కున మెరిశాడు. ఈ చిన్న పాత్రలో అఖిల్ కొద్ది సేపే కనిపించినా చాలా స్టైలీష్‌గా మెరవడంతో మంచి పేరు వచ్చింది. ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేశాడు. అఖిల్ హీరోగా ఎంట్రీ 2015లో జరగనుంది. వివి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యువ హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

నాగశౌర్య:
ఈ సంవత్సరం టాలీవుడ్‌కు పరిచయం అయిన మరో యువ హీరో నాగశౌర్య. చూడడానికి అందంగా ఉండే ఈ యంగ్ హీరో ఏప్రిల్‌లో చందమామ కథలు సినిమాలో క్యారెక్టర్ నటుడిగా మెప్పించాడు. తర్వాత ఊహలు గుసగుసలాడే వేళ, దిక్కులు చూడకు రామయ్యా, లక్ష్మీరావే మా ఇంటికి సినిమాలతో పర్వాలేదనిపించుకున్నాడు.

ఇంకా ఈ సంవత్సరం చాలా మంది చిన్న హీరోలు వెండితెరకు పరిచయం అయినా వారు అనుకున్న స్థాయిలో గుర్తింపు పొందలేదు.