రివైండ్ 2014 : టాలీవుడ్ టాప్ మూవీస్

మరి కొద్దిగంటల్లో 2014 సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా వందల సినిమాలు విడుదలయ్యాయి. డిసెంబర్ పూర్తయ్యే సరికి దాదాపు 200 స్ట్రెయిట్ చిత్రాలు రిలీజై రేర్ రికార్డ్ ను కూడా టాలీవుడ్ దక్కించుకోనుంది. మరి ఇన్ని సినిమాల్లో ఏవి టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి..? ఏ సినిమా నిర్మాతలకు కాసులు రాల్చింది..

10. కార్తికేయ (7.04)
గతేడాది స్వామిరారాతో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్.. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగించాడు. నూతన దర్శకుడు చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ సైలెంట్ గా వచ్చి వసూళ్ల వర్షం కురిపించింది. దీపావళికి సోలోగా బరిలోకి దిగిన కార్తికేయ.. తొలి రోజు నుంచే మంచి వసూళ్లు సాధించింది. దాదాపు 7.04 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టి.. నిర్మాతల పంట పండించింది. కార్తికేయ విజయంతో  నిఖిల్, కలర్స్ స్వాతి జంటకు హిట్ పెయిర్ అని పేరొచ్చేసింది.

9. రన్ రాజా రన్ (12)
శర్వానంద్ పదేళ్ల కెరీర్ లో రన్ రాజా రన్ ఓ మరుపురాని జ్ఞాపకం. ఎన్నాళ్ల నుంచో సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న శర్వానంద్ కు రన్ రాజా రన్ ఆ లోటు తీర్చేసింది. షార్ట్ ఫిల్మ్ మేకర్ సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. కేవలం 5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. దాదాపు 12 కోట్లు కొల్లగొట్టింది. ఇటు సుజీత్ కెరీర్ కు.. అటు శర్వానంద్ కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది రన్ రాజా రన్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం సంపాదించాడనే ప్రచారం జరుగుతోందంటేనే….సుజీత్ కున్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2014 సినిమాల్లో టాప్ 10లో చోటు దక్కించుకుంది రన్ రాజా రన్.

8. దృశ్యం (20)
ఆరేళ్ళుగా సోలో సక్సెస్ కోసం చకోర పక్షిలా వేచి చూస్తోన్న వెంకటేశ్ కి ఈ ఏడాది దృశ్యం ఆ లోటు తీర్చేసింది. మలయాళ సూపర్ హిట్ దృశ్యం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. తెలుగులో దాదాపు 20 కోట్లు వసూలు చేసింది. వెంకీ లాంటి స్టార్ హీరో సినిమాలో ఉన్నా.. దృశ్యం కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం విశేషం.

7. లౌక్యం (21.55)
ఈ ఏడాది టాప్ 5 హిట్స్ లో ఒకటిగా నిలిచిన చిత్రం లౌక్యం. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ చిత్రం.. లౌక్యంగా విజయం సాధించింది. గోపీచంద్ కెరీర్ లో తొలిసారి 20 కోట్ల మార్క్ అందుకున్న చిత్రం ఇదే. ఓ వైపు ఆగడు.. మరోవైపు గోవిందుడు అందరివాడేలే ధాటిని తట్టుకుని.. నిలబడి భారీ విజయం సాధించింది లౌక్యం. ఈ సినిమాతోనే రకుల్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాదాపు 21.55 కోట్లు కొల్లగొట్టిందీ చిత్రం

6. పవర్  (25.45)
రవితేజ హీరోగా కొత్త దర్శకుడు బాబీ తెరకెక్కించిన పవర్ దాదాపు 25.45 కోట్లు వసూలు చేసింది. బలుపు తర్వాత వచ్చిన ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ మాస్ రాజా కెరీర్ ను దారిలో పెట్టింది. పవర్ లో రవితేజ సరసన హన్సిక, రెజీనా హీరోయిన్లుగా నటించారు.

5. మనం (36.5)
మనం.. ఇది సినిమా కాదు.. ఓ సెలెబ్రేషన్. అక్కినేని చివరి చిత్రంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు విక్రమ్ కుమార్ మనంను ఓ సినిమాలా కాకుండా.. ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించాడు. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య ఒకే తెరపై కనిపించి.. అభిమానులకు ఓ విందు భోజనం పంచారు. ఇక చివర్లో అఖిల్ ఎంట్రీతో మీల్స్ పూర్తయ్యాయి. మనం దాదాపు 36.5 కోట్లు వసూలు చేసి అక్కినేని హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

4. లెజెండ్ (40.4)
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరుకు మాస్ లో ఉన్న పాపులారిటి మాటల్లో చెప్పడం కష్టం. ఈ హీరోకు సరైన హిట్ పడితే.. దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియజెప్పిన చిత్రం లెజెండ్. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దాదాపు 40 కోట్లకు పైగా కొల్లగొట్టి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

3. గోవిందుడు అందరివాడేలే (41.65)
రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన గోవిందుడు అందరివాడేలే కూడా ఈ ఏడాది టాప్ 10 మూవీస్ లో ఒకటిగా నిలిచింది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం దాదాపు 41.65 కోట్లు కొల్లగొట్టింది. కానీ ఓవర్ బడ్జెట్ గోవిందుడిని కొంపముంచింది. సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. చరణ్ కు మాత్రం ఈ సినిమా కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది.

2. ఎవడు (47.1)
సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 47.1 కోట్లు వసూలు చేసింది. కాకపోతే.. ఆర్నెళ్లకు పైగా వాయిదా పడటంతో బడ్జెట్ బాగా పెరిగిపోయింది. దాంతో ఎవడు నిర్మాతలకు లాభాలు తీసుకురాలేకపోయినా.. నష్టాలు మాత్రం తీసుకురాలేదు. వంశీ పైడివల్లి తెరకెక్కించిన ఎవడులో అల్లుఅర్జున్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం ఓ విశేషం.

1. రేసుగుర్రం (59.40)
ఈ ఏడాది ఎన్ని సినిమాలు టాప్ చైర్ కోసం పోటీ పడినా.. అందర్నీ రేస్ లో వెనక్కినెట్టేసిన చిత్రం రేసుగుర్రం. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దాదాపు 59.40 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీలో అత్తారింటికి దారేది, మగధీర, గబ్బర్ సింగ్ తర్వాత స్థానంలో నిలిచింది.