అమీర్ ఖాన్ నిజ‌మే చెప్పాడా..?

బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు ఎప్పుడు ప్ర‌మోష‌న్ కు వ‌చ్చినా.. ఇక్క‌డ ఎవ‌రో ఒకరిద్ద‌రు స్టార్ల పేర్లు చెప్పి అడీషిన‌ల్ ప్ర‌మోష‌న్ చేసుకుంటారు. అమితాబ్ బ‌చ్చ‌న్ వ‌చ్చినా కూడా ఇక్క‌డి హీరోల జపం చేయ‌కుండా వెళ్ల‌రు. ఎందుకంటే వాళ్ళ అభిమానుల ఓట్లు ప‌డాలి క‌దా..! ఇప్పుడు అమీర్ ఖాన్ హైద‌రాబాద్ వ‌చ్చారు. ఆయ‌న తాజా సినిమా దంగ‌ల్ డిసెంబ‌ర్ 23న విడుద‌ల కానుంది. నితీష్ తివారి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. మ‌హ‌వీర్ సింగ్ పొగ‌త్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో అమీర్ న‌లుగురు పిల్ల‌ల తండ్రిగా న‌టించాడు.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చిన అమీర్.. ఇక్క‌డి త‌న‌కు ఇష్ట‌మైన న‌టుల గురించి మాట్లాడాడు. త‌న‌కు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే చాలా ఇష్ట‌మ‌న్నాడు మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్. మెగాస్టార్ యాక్టింగ్ కు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు అమీర్ ఖాన్. ఇంత‌కుముందు చాలాసార్లు హైద‌రాబాద్ వ‌చ్చిన అమీర్.. గ‌తంలో ఎప్పుడూ చిరంజీవి పేరు తీయ‌లేదు. కానీ ఇప్పుడు మాత్రం మీడియా ప్ర‌శ్న అడిగేస‌రికి మ‌రో ఆలోచ‌న లేకుండా చిరంజీవి పేరెత్తాడు. దాంతో పాటు రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఉంద‌ని ఓపెన్ గానే అడిగాడు అమీర్. మ‌హాభార‌తంలో తాను కృష్ణుడు లేదంటే క‌ర్ణుడి పాత్ర చేస్తాన‌ని చెప్పాడు ఈ హీరో. మొత్తానికి కామెడీగా అన్నాడో.. సీరియ‌స్ గానే అన్నాడో గానీ అమీర్ నోటివెంట చిరంజీవి పేరు రావ‌డం మెగా ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచేసింది.