ఏబీసీడీ మూవీ రివ్యూ….

ఏబీసీడీ మూవీ రివ్యూ….

‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’, ‘ఒక్క క్షణం’ చిత్రాల‌తో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. ఈసారి రీమేక్  సినిమాతో మనముందుకు వచ్చాడు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘ఏబీసీడీ’ సినిమాని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. సంజీవ్‌ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. మధుర శ్రీధర్
క‌థేంటంటే: అర‌వింద్ అలియాస్ అవి (అల్లు శిరీష్‌) అమెరికాలో పుట్టి పెరిగిన కుర్రాడు. తండ్రి (నాగ‌బాబు) సంపాదిస్తున్న డ‌బ్బుని విచ్చల‌విడిగా ఖ‌ర్చు చేస్తూ… జ‌ల్సాగా జీవితం గ‌డుపుతుంటాడు. కింది స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ మిలియ‌నీర్‌గా మారిన ఆ తండ్రి త‌న కొడుక్కి  డ‌బ్బు విలువ తెలిసేలా చేయాల‌నుకుంటాడు. అందుకోసం అవిని ఇండియాకి పంపాల‌ని ప్రణాళిక ర‌చిస్తాడు. తన తండ్రి ప్లాన్‌ వేశాడని అవికి ఇండియాలోకి అడుగుపెట్టాకే అర్థం అవుతుంది. నెల‌కి తండ్రి పంపించే రూ. 5 వేల‌తోనే జీవితం గడపాల్సి వ‌స్తుంది. డాల‌ర్ల మ‌ధ్య పెరిగిన అవి నెల నెలా రూ. 5 వేల‌తో ఎలా నెట్టుకొచ్చాడు? స్నేహితుడు బాషా (భ‌ర‌త్‌)తో ఒక బ‌స్తీలో ఎలా జీవితాన్ని గ‌డిపాడు?అత‌నికి డ‌బ్బు విలువ ఎలా ఎప్పుడు తెలిసింది?  ఈ ప్రయాణంలో నేహా (రుక్సార్‌) అనే అమ్మాయితో అవికి ఎలా అనుబంధం పెరిగింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే: డ‌బ్బంటే లెక్క లేని కుర్రాడికి చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేని ప‌రిస్థితులు వ‌స్తే? డాల‌ర్ల కొద్దీ ఖ‌ర్చు పెడుతూ జల్సాలు చేసిన  కుర్రాడు.. ప్రతి పైసాని లెక్క పెట్టుకుంటూ నెట్టుకురావ‌ల్సి వ‌స్తే?.. ఇలా ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తూ క‌థ చెప్పడానికి క‌డుపుబ్బా న‌వ్వించ‌డానికి త‌గిన వేదికే ఈ క‌థ. కొంత‌కాలం కింద‌ట వ‌చ్చిన ‘పిల్ల జ‌మిందార్’ సినిమాలో ఇలాంటి సంద‌ర్భాల్నే ఉప‌యోగించుకుంటూ చ‌క్కటి వినోదం పండించారు. అదే మాదిరిగా. తెలుగులో కూడా మంచి ప్రయత్నం చేశారు. స‌న్నివేశాల్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దారు. చాలాచోట్ల న‌వ్వులు పండాయి.  త‌ప్ప హాస్యం ప‌రంగా ఈ సినిమాలోని సన్నివేశాలు బాగా రాసుకున్నారు. ఓ పది పదిహేను సీన్స్ మాత్రమే మాతృకలోనుంచి తీసుకున్నారు. మిగిలిన సీన్స్ అన్నీ సొంతంగా రాసినవి. తెలుగు నెటివిటీ కి తగ్గట్టుగా చేసిన మార్పులు బాగా కుదిరాయి. అమెరికా జ‌ల్సా జీవితాన్ని…. ఇండియాకి వ‌చ్చాక డ‌బ్బు లేక క‌థానాయ‌కుడు ప‌డే పాట్లని స‌హ‌జంగా తీర్చిదిద్దారు. క‌థ‌తో ప్రేక్షకుడు తొందరగానే క‌నెక్ట్ అవుతారు.  దాంతో స‌న్నివేశాలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి.  దాన్ని అస‌లు క‌థ‌కి మేళ‌వించిన విధానం బాగుంది. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ చిగురించే స‌న్నివేశాలు స‌హ‌జంగా ఉన్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
మొత్తంగా చూస్తే మాతృక‌ని అర్థం చేసుకొన్న విధానం బాగుంది.. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ప్రాచుర్యం పొందిన ఓ వీడియో స్ఫూర్తితో తెర‌కెక్కించినప్పటికీ ఆ స‌న్నివేశాలు బాగా న‌వ్విస్తాయి.

క‌థానాయ‌కుడు అల్లు శిరీష్  త‌న పాత్రలో ఒదిగిపోయే ప్రయ‌త్నం చేశాడు. ఆయ‌న‌కి స్నేహితుడిగా భ‌ర‌త్ న‌టించాడు. ఇద్దరూ క‌లిసి చేసిన సంద‌డి అక్కడక్కడా న‌వ్విస్తుంది. క‌థానాయిక రుక్సార్ ధిల్లన్ అందంగా క‌నిపించింది  ప్రతినాయ‌కుడిగా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి త‌న‌యుడు రాజా న‌టించారు. యువ రాజ‌కీయనాయ‌కుడి పాత్రలో ఆయ‌న క‌నిపించిన విధానం బాగుంది. వెన్నెల కిషోర్ పాత్ర ప‌రిమిత‌మే అయినా బాగా న‌వ్వించారు. నాగ‌బాబు త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. రామ్ సినిమాటోగ్రఫీ, జుదా సాందీ సంగీతం బాగుంది. సినిమా స్థాయికి త‌గ్గట్టే నిర్మాణ విలువ‌లు ఉన్నాయి. ద‌ర్శకుడు ర‌చ‌న ప‌రంగా  క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు ఫలించాయి.

PB Rating 3.25/5