పురందేశ్వరి చెప్పిన నమ్మలేని నిజాలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికాలో ప్రవాసాం«ద్రులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుపాటి దంపతులు టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తాను తేదేపాలోకి వెళుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపాడేశారు. ముందు నుంచి కాంగ్రెస్‌లో ఉన్న తాము కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంతో విబేధించి భాజపాలోకి వెళ్లామన్నారు. అయితే తనకు భాజపా బలంగా ఉన్న చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా చంద్రబాబు కావాలనే అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. అందువల్లే రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందానన్నారు. 

భాజపాతో తమ బంధం బలమైందని ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. అలాగే ప్రస్తుతం నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు తాము కేంద్రం నుంచి తమ వంతుగా నిధులు రప్పించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరుగుతున్న అన్యాయాన్ని తాను గట్టిగా ప్రస్తావిస్తే కొందరు తనను శత్రువుగా చూశారన్నారు. అలాగే ముఖ్యమంత్రి సీటు కోసం నందమూరి, నారా ఫ్యామిలీ మధ్య వార్ జరుగుతోందా అని ప్రశ్నించగా అది పార్టీ వ్యవహారంగా చూడాలే తప్ప కుటుంబ వ్యవహారంగా చూడకూడదని ఆమె చెప్పారు. ఏదేమైనా పురందేశ్వరి తాను తేదేపాకు, చంద్రబాబుకు దూరంగా ఉంటానన్న విషయాన్నే స్పష్టం చేసినట్టు ఆమె చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.