పవన్ కళ్యాణ్ అలాంటి వాడు కాదు – నటుడు రవి వర్మ

ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు నటుడు రవి వర్మ. ఇంజినీరింగ్ పూర్తి చేసిన రవి కథక్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాడు. విలన్ గా విభిన్నమైన పాత్రలు పోషిస్తూనే… అడపాదడపా హీరోగాను తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. రిలీజ్ అవుతున్న ప్రతీ సినిమాలో రవి వర్మ ఉంటున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు…ఆతని టాలెంట్ గురించి. 25 సినిమాలు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా సాగుతున్న తన కెరీర్ గురించి పల్లీ బఠానితో షేర్ చేసుకున్నాడు.

హాయ్ అండీ… వెన్నెల సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. బొమ్మరిల్లు, రెడీ, సైనికుడు, క్లాస్ మేట్స్ వంటి సినిమాల్లో నటించాను. నువ్వే అనే చిత్రంలో లీడ్ రోల్ చేశాను. జల్సా సినిమా ఓ కొత్త అనుభుతిని మిగిల్చింది. నక్సలైట్ లీడర్ గా కనిపించాను. పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం న్యూ ఎక్స్ పీరియెన్స్. క్యారెక్టర్ గురించి బాగా డిస్కస్ చేసేవారు. చాలామంది ఆయన రిజర్వ్ డ్ గా ఉంటారని అంటారు. నాకైతే అలా అనిపించలేదు. నటుడిగా ఎదుగుతున్న ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎన్టీయార్ తో కలిసి రాఖీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. ఎన్టీయార్ సైతం చాలా సరదాగా ఉండేవారు. మహేష్ బాబుతో కలిసి మళ్లీ సినిమా ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఎదురుచూస్తుంటాను. శ్రీమంతుడు సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తాను.

సాగర సంగమం సినిమా చూసి చిన్నప్పుడే కథక్ నేర్చుకున్నాను. నా కెరీర్ కు కథక్ చాలా ఉపయోగపడింది. హావభావాలు పలికించడం సులువవుతుంది. దాంతో పాటు మైమ్ కూడా నేర్చుకున్నాను. అయితే డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ తో సినిమా మాత్రం చేయలేదు. భవిష్యత్తులో అలాంటి సినిమా చేస్తానని ఆశిస్తున్నాను. ఇంజనీరింగ్ సిబిఐటి కాలేజ్ లో పూర్తి చేసి యాక్టింగ్ కోర్స్ చేద్దామని అమెరికా వెళ్లాను. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ అయ్యాను కానీ ఫీజ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇండియాకు తిరిగొచ్చాను. యాక్టింగ్ కోర్స్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది. నా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని అక్కడి ప్రొఫెసర్ చెబితే తెలిసింది. ఈ మధ్య వర్మ గారు కూడా ఇదే మాట చెప్పారు.

ఈ మధ్యకాలంలో నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు కాలింగ్ బెల్, అలా ఎలా. ఈ రెండు సినిమాల్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు మహేష్ బాబు శ్రీమంతుడు, నారా రోహిత్ అసుర, శ్రీకాంత్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా. దీనికి సతీష్ కాశెట్టి దర్శకుడు. అబ్ తక్ చప్పన్ తరహా చిత్రమిది. దీంతో పాటు మంత్ర తులసిరామ్ క్రిమినల్స్, క్షణం అడవిశేషు పివిపి సినిమా, దోచెయ్ తో పాటు పేరు పెట్టని సినిమాల్లో నటిస్తున్నాను.

నాకు మంచి సినిమాలతో పాటు మంచి క్యారెక్టర్లు దొరుకుతున్నాయి. నేను ఎలాంటి పాత్రలిచ్చినా చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా పేరు బాగా రావాలని ఆలోచించలేదు. దర్శకులు నన్ను నమ్మి నాకిచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించేందుకే ట్రై చేస్తాను. దాదాపు 26 సినిమాలు చేశాను. అన్నీ విభిన్నమైన పాత్రలే పోషించాను. నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు… మంచి క్యారెక్టర్లు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.