ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ రివ్యూ

నవీన్ పొలిశెట్టి యూట్యూబ్ లో స్టార్. వెబ్ సిరీస్ లతో అందరికీ పరిచయం అయ్యాడు. ఈ తెలుగు కుర్రాడు ముంబై నుంచి హైదరాబాద్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే చిత్రంలో డిటెక్టివ్ గా నటించాడు నవీన్. చంటబ్బాయ్ తర్వాత పూర్తి స్థాయి డిటెక్టివ్ క్యారెక్టర్ తెలుగులో రావడం ఇదే.

క‌థేంటంటే: నెల్లూరు కూర‌గాయల మార్కెట్‌ దగ్గర ఎఫ్‌బీఐ (ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్) పేరుతో ఓ డిటెక్టివ్ సంస్థని నిర్వహిస్తుంటాడు శ్రీను అలియాస్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్‌ పోలిశెట్టి). చిల్లర కేసుల‌ని చ‌టుక్కున ఛేదిస్తూ డ‌బ్బు సంపాదిస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద కేసు రాక‌పోతుందా? అని ఆశ‌గా ఎదురు చూస్తుంటాడు. అత‌ని ద‌గ్గర అసిస్టెంట్‌గా స్నేహ ( శ్రుతి శ‌ర్మ) చేరుతుంది. చిన్న చిన్న కేసుల‌తోనే కాల‌క్షేపం చేసే వీళ్లకి అనుకోకుండా ఓ పెద్ద కేసు దొరుకుతుంది. ఆ సమయంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ జైల్లో ఉంటాడు. అస‌లు ఆత్రేయ జైలుకి ఎందుకు వెళ్లాల్సి వ‌స్తుంది? వీళ్లకి దొరికిన ఆ పెద్ద కేసు ఏమిటి? దాన్ని ఎలా ఛేదించాడు? ఆ క్రమంలో ఎలాంటి విష‌యాలు తెలిశాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష
ఓ డిటెక్టివ్ స్టోరీ ఇది. డిటెక్టివ్ పాత్రలో నవీన్ అద్భుతంగా నటించాడు. ఎక్కడా తడబాటు లేకుండా పాత్రను కథను తన భుజాలమీదేసుకున్నాడు. పరిశోధనాత్మంగా సాగుతుంది. మర్డర్ మిస్టరీల చుట్టూ తిరుగుతుంది. థ్రిల్లర్ తరహా కథాంశం కావడంతో తర్వాతి సీన్ ఏం జరుగుతుందా అనే ఉత్సుకత కలుగుతుంది. ఓ మర్డర్ మిస్టరీని ఛేందిచే క్రమంలో వచ్చే ట్విస్టులు అద్భుతంగా ఉన్నాయి. ఊహించని సీన్స్ తో మలిచిన కథనం అద్భుతంగా ఉంది. వినోదంతో పాటు సస్పెన్స్ ను బాగా బ్యాలెన్స్ చేశారు. ఊహించని మలుపులతో కథ ముందుకెళ్తుంది. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో కామెడీతో ప్రారంభించి ఆ తర్వాత సీరియస్ మోడ్ లోకి కథ వెళ్తుంది. అద్భుతమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేశాడు దర్శకుడు. ఏజెంట్ పాత్ర మలిచిన విధానం చాలా బాగుంది. కామెడీ చేస్తూనే సీరియస్ గా…. సాగుతుంది.
అస‌లు కేసు ప‌రిశోధ‌న ఎప్పుడైతే మొద‌ల‌వుతుందో అప్పట్నుంచి క‌థ వేగం అందుకుంటుంది.

ప‌రిశోధ‌న అంతా కూడా థ్రిల్‌కి గురిచేస్తుంది. ప్రేక్షకుడి ఊహ‌కు అంద‌ని రీతిలో సీన్స్ పండాయి. ఎక్కడా గందరగోళం లేకుండా కథను ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. చాలా క్లారిటీగా కథ చెప్పాడు. కేసుని ఆశ్చర్యక‌ర‌మైన రీతిలో ముగించ‌డం ఆక‌ట్టుకుంటుంది. మదర్ సెంటి మెంట్ ని అంతర్లీనంగా చెప్పిన విధానం బాగుంది. మదర్ చనిపోవడానికి ఇతర మర్డర్ మిస్టరీలకు పెట్టిన లింక్ బాగుంది. దాదాపుగా అంద‌రూ కొత్త న‌టీన‌టులైనా, వాళ్ల పాత్రల్లో స‌హ‌జంగా ఇమిడిపోయిన విధానం ప్రేక్షకుల‌కు తాజాద‌నాన్ని పంచుతుంది.

హీరోకు హీరోయిన్ సపోర్ట్ కూడా బాగా దొరికింది. స్నేహ అనే అసిస్టెంట్ పాత్రలో శ్రుతి శ‌ర్మ చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించింది. ప్రధాన పాత్రతో పాటే సినిమా అంతా క‌నిపిస్తుంది. ఈ రెండు పాత్రలే సినిమాకి కీల‌కం. మిగిలిన పాత్రధారులు కూడా దాదాపుగా కొత్తవాళ్లే. సాంకేతిక విభాగం చ‌క్కటి ప‌నితీరుని క‌న‌బ‌రిచింది. మార్క్ కె.రాబిన్ సంగీతంతో పాటు, స‌న్నీ కూర‌పాటి కెమెరా ప‌నిత‌నం చాలా బాగుంది. నెల్లూరు నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ఆ వాతావ‌ర‌ణం ఉట్టి ప‌డిందంటే కార‌ణం ఆర్ట్ డైరెక్టర్ ప‌నితీరే. ద‌ర్శకుడు స్వరూప్ రాసుకున్న క‌థ‌, ఆయ‌న చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. ఆయ‌న రాసిన మాట‌ల్లోనూ మెరుపులు క‌నిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా….. డిటెక్టివ్ సినిమాలు మనకు చాలా తక్కువ. అలాంటిది చాలా కాలంతర్వాత ఓ మంచి డిటెక్టివ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కథలో అనేక మలుపులు థ్రిల్ కు గురి చేస్తాయి. తర్వాతి సన్నివేశాన్ని ఉహించడం కష్టం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి లాంటి మంచి నటుడు, స్వరూప్ లాంటి మంచి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి దొరికినట్టే. సో గో అండ్ వాచిట్.

Rating : 3.25/5