అఖిల్ దెబ్బ‌కు అక్క‌డ తేలాడు..

చేసింది ఒకే ఒక్క సినిమా.. కానీ ద‌ర్శ‌కులను ఆడుకోవ‌డంలో బాగా ఆరితేరిపోయాడు అఖిల్. ఈ అక్కినేని వార‌సుడు అఖిల్ సినిమా చేసి ఇప్ప‌టికే ఎనిమిది నెల‌లు గ‌డిచింది. ఈ సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా మొద‌లుపెట్ట‌లేదు. మ‌ధ్య‌లోనే ముగ్గురు న‌లుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. కానీ ఏదీ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. కొర‌టాల శివ‌, హ‌ను రాఘ‌వ‌పూడి, వంశీ పైడిప‌ల్లి.. ఇలా రోజుకో పేరు వినిపిస్తున్నా సిసింద్రీ మాత్రం త‌న రెండో సినిమాపై నోరు విప్ప‌ట్లేదు. ఇక మొన్న‌టి వ‌ర‌కు అఖిల్ సినిమా చేస్తున్నాడ‌నుకున్న వంశీ.. అక్కినేని క్యాంప్ లో మాయ‌మై మెగా క్యాంప్ లో తేలాడు.

బృందావ‌నం, ఎవ‌డు, ఊపిరి లాంటి వ‌ర‌స విజ‌యాల త‌ర్వాత కూడా వంశీ పైడిప‌ల్లి ఇప్ప‌టికీ అవ‌కాశాల వేట‌లో మాత్రం వెన‌కాలే ఉన్నాడు. అఖిల్ సినిమాకు ఇత‌డే ద‌ర్శ‌కుడు అని నాగార్జున చెప్పిన త‌ర్వాత కూడా ఆ అవ‌కాశం చేజారింది. ఆ త‌ర్వాత మ‌హేశ్ తో సినిమా చేస్తాడ‌నుకున్నారు. కానీ అది కూడా ప‌క్క‌కు వెళ్లింద‌ని స‌మాచారం. దాంతో ఇప్పుడు సాయిధ‌రంతేజ్ కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌న స్థాయి ఓ మెట్టు త‌గ్గించుకుని మ‌రీ సాయితో జోడీ క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు ఈ ద‌ర్శ‌కుడు. సుప్రీమ్ తో 25 కోట్ల స్టార్ అనిపించుకున్న సాయిధ‌రంతేజ్ తో వంశీ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ జ‌త క‌లిస్తే వ‌చ్చే సినిమా ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో..! ఈ సినిమా సాయిధ‌రం కెరీర్ కు ఏమో గానీ వంశీ కెరీర్ కు మాత్రం చాలా కీల‌క‌మే.