అలా ఎలా విజయాన్ని.. అమ్మ చూసుంటే బాగుండేది.. ఆమెకే అంకితం – సై షాని

ఈ క్రిస్ మస్ స్పెషాలిటీ ఏంటి..
ఈ క్రిస్ మస్ కు రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి అలా ఎలా ఘనవిజయం సాధించడం. రెండోది మాకు కూతురు పుట్టడం. నటుడయ్యాక సై తర్వాత అంతటి ఘనవిజయం అందుకున్న సినిమా అలా ఎలా. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అలా ఎలా లాంటి సినిమా కోసం…అలా ఎలా లాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను. ఇన్నేళ్ల తర్వాత నాకు భారీ విజయం దక్కింది. సూపర్ హ్యాపీ. ఈ సక్సెస్ నాకు గాడ్ గిఫ్ట్.

అలా ఎలా విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు…
అలా ఎలా సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. మౌత్ పబ్లిసిటీతో హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తోంది. ప్రేక్షకులు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో మేం ప్రత్యక్షంగా థియేటర్లకు వెళ్లి చూశాం. ఎలా ఎంజాయ్ చేస్తున్నానో మాటల్లో చెప్పలేను. కలెక్షన్సే చెబుతున్నాయి. అయితే ఈ విజయాన్ని మా అమ్మ కూడా చూసి ఉంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా సై అగ్రిమెంట్ చేసుకున్న రోజే మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. హిట్టయ్యాయి. కానీ అలా ఎలా నాకు వెరీ వెరీ స్పెషల్. ఇందులో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. ఘనవిజయం అందుకున్నాను. ఈ సక్సెస్ ఫుల్ మూవీని మా అమ్మకు అంకితమిస్తున్నాను.

మీరు స్పోర్ట్ మెన్ అని విన్నాం. కానీ అటువైపు వెళ్లకుండా సినిమాల్లోకి రావడానికి కారణమేంటి….
నాకు చిన్నప్పటినుంచి పాపులారిటీ అంటే ఇష్టం. నలుగురిలో స్పెషల్ గా ఉండాలని కోరుకుంటా. స్పోర్స్ మెన్ ను కావడంతో…నాకు మంచి గుర్తింపే వచ్చింది. 100.మీ పరుగుపందెంలో ఆల్ ఇండియా యూనివర్శిటీస్ గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను. అయితే మోకాలి నొప్పి రావడంతో స్పోర్ట్ పక్కన పెట్టాల్సి వచ్చింది. సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించొచ్చనే ఆలోచన వచ్చింది. అలా సై సినిమాలో అవకాశం దక్కింది. స్పోర్ట్ బ్యాక్ గ్రౌండ్ సినిమా కావడంతో రాజమౌళి గారు నాకు సైలో అవకాశమిచ్చారు. ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటి నుంచే అందరూ సై షానీ అనడం మొదలు పెట్టారు.

సినిమా రంగంలో అవకాశాలు దక్కాలంటే బ్యాక్ గ్రౌండ్ తప్పనిసరి కదా…మరి మీరు ఎలా నెట్టుకు రాగలుగుతున్నారు…
నాకు ఇండస్ట్రీలో తాతాయ్ లు, బాబాయ్ లు, మావయ్యలు ఎవ్వరూ లేరు. అయితే నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు ఇచ్చిన ప్రోత్సాహం తోనే అవకాశాలు సంపాదిస్తున్నా. నా కష్టాన్ని నమ్ముకొనే ముందుకెళ్తున్నా. నా చేతిలో నాలుగు సినిమాలున్నాయంటే కారణం నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ మాత్రమే.

అలా ఎలా మీకు మంచి బ్రేక్ ఇచ్చింది. అందులో హీరోలా చేశారు. ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది…
డైరెక్టర్ అనీష్ తో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయముంది. అనీష్ డైరెక్ట్ చేసిన మిస్ డ్ కాల్ అనే షార్ట్ ఫిలింలో నటించాను. ఆ షార్ట్ ఫిలిం కోసం ఇద్దరం కలిసి దాదాపు 15 రోజులు పనిచేశాం. షూటింగ్ సమయంలో నన్ను బాగా గమనించేవాడు. నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అలా ఎలా చిత్రంలో క్యారెక్టర్ రాసుకున్నాడు. కథ రెడీ అయిన తర్వాత ఫస్ట్ కన్ ఫర్మ్ అయ్యింది నేనే. రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ లాంటి మంచి నటులతో పాటుగా నాక్కూడా అవకాశమివ్వడం నిజంగా అదృష్టమే. కళ్యాణ్ క్యారెక్టర్ కు నన్నుఓకే చేసిన ప్రొడ్యూసర్స్ కు నేను తప్పకుండా థాంక్స్ చెప్పుకోవాల్సిందే.

మీరు మరీ బ్లాక్. మీ కలర్ సినిమా ఇండస్ట్రీకి పనికొస్తుందా…అంటే కలర్ మీకు ప్లస్ అయ్యిందా…మైనస్ అనుకుంటున్నారా..
కలర్ నాకు ప్లస్ అయ్యింది. ఎందుకంటే….చాలా మంది నన్ను అందంగా లేవన్నారు. కలర్ లేదని అన్నారు. కానీ ఇండస్ట్రీ పరంగా చూస్తే…నా కలర్ వల్లే నేను నలుగురిలో స్పెషల్ గా కనిపిస్తున్నాను. రాజమౌళి గారు కూడా నా కలర్ కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే అలా ఎలా చిత్రంలోనూ నా కలర్ నాకు ఎంత ప్లస్ అయిందో మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదనుకుంటా.

ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు. వెంకటేష్, రామ్ లాంటి స్టార్స్ తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది.
సై, ఘర్షణ, దేవదాస్, రెడీ, రుషి, హ్యాపీ, అలా ఎలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో నటించాను. వెంకటేష్ గారు నా క్యారెక్టర్ గురించి చాలా డిస్కస్ చేశారు. ఎవరు చేస్తున్నారనే విషయంపై ఆరా తీసి…యాసిడ్ పోసే సీన్ పండితే…సినిమాకు చాలా ప్లస్ అవుతుందని చెప్పారు. వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎలివేట్ కావాలంటే…నా సీన్ పండాల్సిందే అని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆ సీన్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆయన ఇప్పటికీ నన్ను జిజికా అని పిలుస్తుంటారు. ఇక రామ్ సూపర్ ఎనర్జిటిక్ పర్సన్. ఆయనతో ఎన్ని సినిమాల్లో అయినా నటించాలనుకుంటాను. పూరీ, వినాయక్ సినిమాల్లో నటించాలనుంది. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా.

యాక్టింగ్ నేర్చుకున్నారా….
నేను నిజాం కాలేజీలో చదువుకున్నాను. అక్కడే థియేటర్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి AREA (ఆర్ట్ రిలేటెడ్ ఎక్స్ పెరిమెంటల్ అసోసియేషన్) స్టార్ట్ చేశాం. ఈ సంస్థ ద్వారా చాలా నాటకాలు వేశాం. ఈ నాటకాల ద్వారానే యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నా. ఇప్పటికీ స్టేజ్ షోలు చేస్తుంటాం.

ఫ్యూచర్ ను ఎలా ప్లాన్ చేసుకున్నారు…
సినిమాలు చేస్తూనే…పది మందికి ఉపయోగపడేలా ఉండాలనేది నా కోరిక. ప్రతీ రోజు పదిమందికి అన్నం పెట్టే స్థితికి చేరుకోవాలనేదే నా లక్ష్యం. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా న్యాయం చేయడం కోసం శ్రమిస్తాను. నా ఫేవరేట్ నటుడు కమలహాసన్. ఆయనలా విభిన్న పాత్రలు చేయాలనేదే నా కోరిక. ప్రొడక్షన్ పరంగా నాలెడ్జ్ పెంచుకున్నాను. ఇప్పటికీ నేను నటించకపోయినా…చాలా సినిమాలకు ప్రొడక్షన్ సపోర్ట్ చేస్తుంటాను.