అప్పుడు జంబ‌ల‌కిడి.. ఇప్పుడు పంబ‌ల‌కిడి..

జంబ‌ల‌కిడిపంబ‌.. ఈ పేరు విన‌గానే న‌వ్వు ఆపుకోవ‌డం క‌ష్టం. ఇవివి స‌త్య‌నారాయ‌ణ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఇది కూడా ఒక‌టి. ఆడాళ్లు మ‌గాళ్లుగా మార‌డం.. పెద్దోళ్లు చిన్నోళ్లుగా మార‌డం.. అబ్బో ఇలాంటి విచిత్రాలు ఇంకా చాలానే ఉంటాయి ఈ సినిమాలో. అప్ప‌ట్లో ఈ సినిమా ఓ సంచ‌ల‌నం. ఇవివి బుర్ర‌లో త‌ట్టిన ఈ ఐడియా తెలుగు ఇండ‌స్ట్రీని కుదిపేసింది. సీనియ‌ర్ న‌రేష్ హీరోగా వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాదు.. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఎప్ప‌ట్నుంచో ఉన్నాడు అల్ల‌రి న‌రేష్. నిజానికి త‌న తండ్రి ఇవివి ఉన్న‌పుడే జంబ‌ల‌కిడి పంబ సీక్వెల్ పై చ‌ర్చ‌లు న‌డిచాయి. ఆ త‌ర్వాత ఆయ‌న చ‌నిపోయాక‌.. కొన్నేళ్ళు ఈ సీక్వెల్ పై ఎవ‌రూ నోరు మెద‌ప‌లేదు.

 

ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ న‌రేష్ ఈ సీక్వెల్ పై మ‌న ఆశ‌ను బ‌య‌ట‌పెట్టాడు. జంబ‌ల‌కిడిపంబ‌కు సీక్వెల్ కు పంబ‌ల‌కిడిజంబ చేయాల‌నేది న‌రేష్ ఆశ‌. అయితే అది త‌న డైరెక్ష‌న్ లో వ‌స్తుందా.. బ‌య‌టి వాళ్లు చేస్తారా అనేది చెప్ప‌లేదు అల్ల‌రోడు. ఇప్ప‌ట్లో త‌న‌కు ద‌ర్శ‌క‌త్వం చేసే ఇష్టం లేద‌ని చెప్ప‌డంతో ఇది క‌చ్చితంగా బ‌య‌టి వాళ్ల‌కు అప్ప‌గిస్తాడ‌ని తెలుస్తోంది. అయితే జంబ‌ల‌కిడిపంబ అనేది కామెడీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఏ ద‌ర్శ‌కుడికైనా క‌త్తి మీద సామే. మ‌రి అంత ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు తెలుగులో ఎవ‌రున్నారు..? జ‌ంబ‌ల‌కిడిపంబ‌.. పంబ‌ల‌కిడిజంబ‌గా వ‌స్తుందా… చూడాలిక‌..!