అంబటి రాయుడు సెంచరీ.. భారత్‌కు రెండో విజయం.. లంకకు మళ్లీ భంగపాటే

అంబటి రాయుడు అజేయ సెంచరీ సాధించడంతో శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. శ్రీలంకలో కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 92 పరుగులతో అజేయంగా నిలిచారు. సంగక్కర 61, దిల్షాన్ 35 పరుగులు సాధించారు. భారత్ బౌలర్లలో ఉమేశ్‌యాదవ్, రవిచంద్ర అశ్విన్, అక్షర్‌పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

275 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ విజయం సాధించింది. హైదరాబాదీ అంబటి రాయుడు అజేయ సెంచరీ సాధించడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాయుడు 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. శిఖర్‌ధావన్ 79, విరాట్‌కోహ్లి 49 పరుగులు సాధించారు. దీంతో ఐదు వన్డేల సీరీస్‌లో భారత్ వరుసగా రెండో విజయం సాధించి సీరిస్‌లో 2-0 ఆధిక్యంతో నిలిచింది. రాయుడుకు మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇదే జోరు కొనసాగితే భారత్ సులువుగా కప్ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరుజట్ల మధ్య మూడో వన్డే ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతుంది.