నాటి ఆంధ్రజ్యోతి వెలుగులేమయ్యాయి!

ఆంధ్రజ్యోతి కొద్ది దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన దినపత్రిక. అయితే ఈ పత్రిక ప్రస్తుత ఎండీ వేమూరి రాధాకృష్ణ టేకోవర్ చేశాక ఎన్నో సంచలనాలకు వేదికైంది. నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడి అప్పట్లో ఎన్నో అవినీతి అక్రమాలను నిర్భయంగా బయటపెట్టింది. అయితే అప్పట్లో ఎంతో సంచలనాలతో క్రేజ్ తెచ్చుకున్న పత్రిక తర్వాత తనకంటూ సొంతంగా ఓ ఛానెల్‌ను పెట్టుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వచ్చిన ఈ ఛానెల్‌కూడా అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. అయితే రాష్ట్ర విభజనాంతరం వివిధ కారణాలతో ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు, ఏబీఎన్ ఛానెల్ కూడా క్రమంగా ప్రజాదారణ కోల్పోతున్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఎంఎస్‌వోలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిందన్న కారణంతో ఏబీఎన్ ఛానెల్‌ను నిషేధించారు.

ప్రస్తుతం తెలుగున్యూస్ ఛానెల్స్‌లో రేటింగ్ పరంగా చూసుకుంటే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి 15వ స్థానానికి దిగజారింది. మహా, హెచ్ఎంటీవీ, ఐన్యూస్, స్టూడియో ఎన్ .. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఛానెల్స్ ఏబీఎన్ కంటే ముందున్నాయి. మరీ విచిత్రం ఏంటంటే రాష్ట్ర విభజనాంతరం రెండు ఛానెళ్లుగా విడిపోయిన ఈటీవీ రెండు ఛానెళ్లు కూడా ఏబీఎన్‌కు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇక తెలంగాణలో లేకపోయినా కేవలం ఏపీ ప్రసారాలతో టీవీ-9 టాప్ ఫైవ్‌లో ఉంది. ఇక రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రజ్యోతి పత్రికకు ఉన్న క్రేజ్ తర్వాత తగ్గిందనే చెప్పాలి. అంతకుముందు ఆ ప్రతిక ప్రధాన సంచిక బ్యానర్‌లో వచ్చే కథనాలు ఎంతో ఆసక్తిగా ఉండేవి. తర్వాత ఆ స్థాయి కథనాలు నూటికో కోటికో అన్నట్టుగా ఉన్నాయి. ఇక ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి సర్కులేషన్‌తో పోల్చుకుంటే కూడా ఆంధ్రజ్యోతి చాలా వెనకబడిఉంది. ఈనాడు ఎవ్వరికి అందనంత ఎత్తులో 18.25 లక్షల డైలీ సర్క్యులేషన్‌తో ముందుకు దూసుకెళుతోంది. ఇక సాక్షి సర్క్యులేషన్ 12 లక్షల వద్ద ఉంది. ఆంధ్రజ్యోతి కేవలం 5.25 లక్షల డైలీ సర్య్కులేషన్ మాత్రమే కలిగి ఉంది. పైగా చాలా యూనిట్లలో రుణాత్మక రేటు నమోదు చేస్తోంది. ఇప్పట్లో కనీసం 6 లక్షలకు చేరుకోవడం కూడా గగనంగా ఉంది. ఇతర పత్రికల్లో మాదిరిగానే ఇక్కడ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఒక్కో యూనిట్లో 20-30 మంది పనిచేస్తుంటే వారు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నట్టు కాకుండా స్పార్క్, ఎస్యూర్ అనే సంస్థలలో పని చేస్తున్నట్టు చూపుతున్నారు. కేవలం ఒక్కో జిల్లాలో నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఆమోదా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నట్టు రికార్డులు చూపిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వేజ్ బోర్డు అమలు చేయాల్సి వస్తే జ్యోతిలో మరిన్ని సంస్కరణలు తప్పేలా లేవు.

ఇక కొన్ని జిల్లాల్లో చాలా గ్రామాల్లో ఆంధ్రజ్యోతి పత్రిక కనిపించడం లేదు. మేనేజ్‌మెంట్ కావాలనే ఖర్చు తగ్గించుకునేందుకు పత్రికను వేయడం లేదన్న వాదనలు కూడా ఉన్నాయి. ప్రతిక ప్రమోషన్‌పై దృష్టి పెట్టడం లేదు.ఇక ఛానెల్ ప్రసారాలు తెలంగాణలో ప్రసారం కాకపోవడంతో అక్కడ నుంచి ప్రకటనలు కూడా రావడం లేదు. ఎంతో కీలకమైన హైదరాబాద్‌లో కూడా ఈ ఛానెల్ రాకపోవడంతో యాడ్ రెవెన్యూ బాగా తగ్గిపోయింది. ఇప్పటకి కూడా ఎండీ వేమూరి రాధాకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో ఉండడంతో ఇప్పట్లో ఆ ఛానెల్ ప్రసారాలు తెలంగాణలో ప్రసారమయ్యే అవకాశాలు లేవు. పోనీ చంద్రబాబు అయినా ఆదుకుంటాడా అంటే చంద్రబాబు-వేమూరి మధ్య కూడా అంత సఖ్యత లేదని సమాచారం. ఏదేమైనా దశాబ్దకాలంగా ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఆంధ్రజ్యోతి వెలుగులు ఇప్పుడు అంతగా విరజిమ్మడం లేదన్న వ్యాఖ్యలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.