ఆమెను చూసి షాకై… డైలాగ్స్ మర్చిపోయేదాన్ని – హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్

మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కించిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. రమ్య కృష్ణ అత్త పాత్రలో నటించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ గ్రాండియర్ లెవల్లో తెరకెక్కించింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంత మంచి పాత్ర అందరికీ లభించదని అంటోంది అనూ. ఈనెల 13న శైలజా రెడ్డి అల్లుడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హైలైట్స్ ని మనతో పంచుకుంది అను… ఆమె మాటల్లోనే….

‘‘ఇందులో నా పేరు అను. పొగరు, అహంకారం ఉన్న పాత్ర పోషించా. నా పాత్ర నుంచే వినోదం పండించారు. స్వతహాగానే నాకు కోపం ఎక్కువ. కానీ ఎవ్వరిపైనా చూపించను. అను అలా కాదు. పొగరుతో ఏమైనా చేస్తుంది. ఎవరిపైనైనా చూపిస్తుంది. చైతూ మంచి నటుడు. రమ్యకృష్ణలాంటి సీనియర్‌ నటీమణితో కలసి పనిచేయడం ఆనందాన్నిచ్చింది. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా సెట్‌కి వస్తారు. డైలాగ్‌ పేపర్‌ చూడగానే పాత్రలో లీనమైపోతారు. కొన్నిసార్లు ఆమె నటన చూసి షాకైపోయా. నా డైలాగులు కూడా మర్చిపోయేదాన్ని.

ఈమధ్య నేను నటించిన చిత్రాలు సరిగా ఆడలేదు. కారణాలేమైనా.. జయాపజయాలు అనేవి మన చేతుల్లో లేని విషయాలని అర్థమైంది. కెరీర్‌ తొలినాళ్లలోనే తప్పులు చేయడం మంచిది. దానికి తగిన సమయం ఇదే. ఎందుకంటే ఏం నేర్చుకున్నా ఇప్పుడే కదా. త్రివిక్రమ్‌, పవన్‌ కల్యాణ్‌ల పేరు చూసి ‘అజ్ఞాతవాసి’లో నటించలేదు. కథ నచ్చి చేశాను. ప్రతిభ పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే ఒక్క సినిమా చాలు. కీర్తి సురేష్‌ని చూడండి.. మహానటితో తానేంటో నిరూపించుకుంది. ఆ సినిమా ఆమె కెరీర్‌ మొత్తాన్ని మార్చేసింది. అలాంటి సినిమా కోసం నేనూ ఎదురుచూస్తున్నా. అని అన్నారు.