రివ్యూ – అనుక్షణం సమీక్ష

ఇటీవల వరుసపెట్టి జయాపజయాలతో సంబంధం లేకుండా నెలకో సినిమా చేసుకుంటూ పోతున్నాడు రాంగోపాల్‌వర్మ. క్షణక్షణం, శివ, సత్య సినిమాల నాటి వర్మను ఇప్పటి వర్మను సరిపోల్చుకున్న టాలీవుడ్ ప్రేక్షకులు ఈ వర్మ ఏంట్రా బాబు మన కర్మ అని అనుకోవడం.. నా ఇష్టం నేను ఇలాగే సినిమాలు తీస్తాను.. మీకు ఇష్టమైతే చూడండని వర్మ అనడం సాధారణమైపోయింది. ఇక వర్మ మారడు అని టాలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటున్న టైంలో మంచు విష్ణుతో క్షణక్షణం ఉత్కంఠ కలిగిస్తానని చెప్పి అనుక్షణం తీశాడు. మరి ఈ సినిమా ఎంత వరకు మన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో చూద్దాం.

కథ, కథనం…

హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ సీతారం(సూర్య) సైకో కిల్లర్ అవతారం ఎత్తి తన క్యాబ్‌లో ఎక్కే అమ్మాయిలను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చంపేస్తుంటాడు. అర్ధరాత్రి సీరియల్‌గా జరుగుతున్న ఈ హత్యలను ఎవరు చేస్తున్నారో కనిపెట్టేందుకు క్రైం బ్రాంచ్ స్పెషల్ ఆఫీసర్ గౌతమ్(మంచు విష్ణు) ప్రయత్నిస్తు ఫెయిల్ అవుతుంటాడు. అమెరికాలో సైకో కిల్లర్స్‌పై అధ్యయనం చేసిన రీసెర్చ్ స్కాలర్‌గా సీనియర్ నటి రేవతి గౌతమ్‌కు సాయం చేస్తుంది. టీవీ యాంకర్‌గా మధుశాలిని ఈ హత్యలకు ఓవర్ ప్రచారం కల్పిస్తుంది. దీంతో అతడు మరింత రెచ్చిపోయి హోం మినిస్టర్ మనువరాలినే హత్య చేస్తాడు. గౌతమ్ భార్యగా తేజస్విని, నవదీప్ కూడా కథలో ఉంటారు. చివరకు ఆ సైకో కిల్లర్‌ను గౌతమ్ ఏం చేశాడు ? ఆ ప్రయత్నంలో అతడికి ఎదురైన ఇబ్బందులేంటి అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. 

ఫ్లస్ పాయింట్స్:

రాంగోపాల్ వర్మ అనుక్షణంతో మరో సంచలనం రేపాడు. శివ, క్షణక్షణం నాటి వర్మను టాలీవుడ్‌కు గుర్తుకు తెచ్చాడు. కథ లేకున్నా ఉత్కంఠ కలిగించే కథనంతో ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠ కలిగించాడు. వర్మ గత సినిమాలకు భిన్నంగా .. ఒక రకంగా విశ్వరూపమే చూపాడు. ఇక మోహన్‌బాబు విష్ణుని రియల్‌గా ఐపీఎస్ చేయాలన్నది తన చిరకాల కోరిక అని చాలాసార్లు చెప్పాడు. ఈ సినిమాలో అతడు నిజమైన ఐపీఎస్ అధికారా అన్నట్టుగా నటించాడు. హ్యాట్సాప్ విష్ణు. సైకో కిల్లర్‌గా సూర్య నటించాడు అనేకంటే జీవించాడు అనాలి. పోలీసులకు సహాయం చేసే పాత్రలో సీనియర్ నటి రేవతి పర్వాలేదనిపించారు. మధుశాలిని పాత్ర సినిమాకు బాగా హెల్ఫ్ అయ్యింది. 

మైనస్ పాయింట్స్:

వేగంగా సాగుతున్న సినిమాలో బ్రహ్మానందం సీన్స్ సినిమా వేగాన్ని స్లో చేశాయి. ఇలాంటి సినిమాలో లాజిక్స్, లోపాలు ఉన్నా వాటిని ఎత్తిచూపలేం. మరికొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ యాడ్ చేసి ఉంటే సినిమాకు మరింత నిండుదనం వచ్చేది. అంతకు మించి చెప్పుకోదగ్గ లోపాలు లేవు.

సాంకేతికనిపుణుల పనితీరు:

సాంకేతికంగా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. క్లోజప్ షాట్స్, చీకట్లో సీన్స్ తీయడంలో కెమేరా పనితనం బయటపడింది. ఈ థ్రిల్లర్ సినిమాకు ఎలా కావాలో సంగీతం కూడా అలాగే కనెక్ట్ అయ్యింది. ఎడిటర్‌కు మంచి మార్కులు వేయవచ్చు. ఇక కథను డవలప్ చేసుకున్న విధానం, స్క్రీన్‌ప్లేలో సడలని బిగి, కథను మన తెలుగుకు కనెక్ట్ చేసిన విధానంతో పాటు దర్శకత్వం అన్ని బాగా కుదిరి చాలా రోజుల తర్వాత వర్మ చేతి నుంచి మంచి పసందైన వంటకం వచ్చినట్టు ఉంది. నిర్మాణ విలువలు ఓకే. చిన్న బడ్జెట్ సినిమా కావడంతో వర్మ చెప్పినట్టు ఖర్చు పెట్టారు.

చివరగా…

టాలీవుడ్‌కు కొత్త తరహా జోనర్‌లో యాక్షన్+థ్రిల్లర్ సైకో మూవీని పరిచయం చేసిన వర్మ, విష్ణులకు ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఈ సినిమా పేరులో ఉన్నట్టుగా అనుక్షణం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. అయితే మన తెలుగు ప్రేక్షకులు కోరుకునే రొడ్డ కొట్టుడు పాటలు, ఫైట్స్ ఉండవు. చాలా రోజుల తర్వాత వర్మ నుంచి వచ్చిన మంచి సినిమా ఇది. ఇలాంటి తక్కువ నిడివితో పాటు డిపరెంట్ కాన్సెఫ్ట్ సినిమాలు రావాల్సి ఉంది. ఓవరాల్‌గా యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి బాగా నచ్చుతుంది. వర్మ ప్రయత్నానికి విమర్శలకు నుంచి ప్రశంసలు కూడా ప్రారంభమవుతాయి.