ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ర‌ఘురామ‌కృష్ణంరాజు..?

తెలుగు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ అధినాయ‌క‌త్వం యోచిస్తోంది. ఈ దిశ‌గా పార్టీని ప్ర‌క్షాళ‌న చేసేందుకు పావులు క‌దుపుతోంది. ఇందులోభాగంగా ఏపీ బీజేపీ ప‌గ్గాల‌ను ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణంరాజుకు అప్ప‌గించాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టిదాకా ఏపీ బీజేపీ కార్య‌క‌లాపాల‌కు నేతృత్వం వ‌హిస్తున్న విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు ప‌నితీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది. దీంతో అధ్య‌క్ష పీఠాన్నిబ‌ల‌మైన వ్య‌క్తికి ఇవ్వాల‌ని బీజేపీ యోచిస్తోంది.

ఏపీలో బ‌ల‌మైన కాపు, క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల త‌రువాత కాస్తో.. కూస్తో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం ఇదే కావ‌డం.. గోదావ‌రి జిల్లాల్లో ఈ సామాజిక‌వ‌ర్గానికి ప్రాబ‌ల్యం ఉండడంతో రాజు ఎంపిక త‌మ‌కు లాభిస్తుంద‌ని పార్టీ అధినాయ‌కత్వం యోచ‌న‌. మొత్తంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలుండ‌గా అందులో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెప్పుకోద‌గ్గ ఓటు బ్యాంకు ఉండ‌డంతో, ఆ.. ప్రాబ‌ల్యాన్ని త‌న సొంతం చేసుకోవాల‌న్న‌ది బీజేపీ హై క‌మాండ్ భావ‌న‌. ఒక‌వేళ ర‌ఘురామ రాజుకు పార్టీ ప‌గ్గాలు ఇవ్వ‌కున్నా ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఎవరికైనా ఈ బాధ్య‌త‌లు క‌ట్టబెట్టే అవ‌కాశం ఉంది.

తొలుత వైకాపాలో న‌ర‌సాపురం ఎంపీ టిక్కెట్టు ఆశించిన ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌ర్వాత బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు స్వ‌యాన ఆయ‌న వియ్యంకుడు. కొద్దికాలంగా ఏపీలోనూ బీజేపీ బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. కానీ.. క్యాడ‌ర్ లేక‌పోవ‌డం.. పొలిటిక‌ల్ ఈక్వేష‌న్లు కుద‌ర‌క‌పోవ‌డంతో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌తికిల‌ప‌డుతోంది. ఓ విధంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల హ‌వాకు చెక్ పెట్టాల‌న్న‌దే అమిత్ షా వ్యూహం.

రెండు తెలుగు రాష్ట్రాల నాయ‌కులు కొట్టుకు చ‌స్తున్నా కేంద్రం ప్రేక్ష‌క‌పాత్ర‌కే ప‌రిమిత‌మైంది. ప్రాంతీయ పార్టీల హ‌వాకు చెక్ చెప్పి ద‌క్షిణ భార‌తంలో పాగా వేయాల‌న్న‌ది అమిత్ షా ప‌న్నాగం. అందులో భాగంగానే ర‌ఘురామ‌రాజుకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే ఛాన్స్ ఉంది.ఇక హ‌రిబాబు విష‌యానికి వ‌స్తే పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ని నేత‌గా ఆయ‌న‌కు పేరుంది. ఎంపీగా గెలుపొంద‌డం కూడా .. యాదృశ్చిక‌మే! టీడీపీకి ఢీకొనేంత స‌త్తా కాదు క‌దా! క‌నీసం ఎదురు ప్ర‌శ్నించే చేవ కూడా లేని నాయ‌కుడాయ‌న‌.

టీడీపీ పుంజుకుంటున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్టీని బ‌లోపేతంచేసేందుకు హ‌రిబాబులాంటి నాయ‌కులు ప‌నిరార‌న్న‌ది అమిత్ షా ఉద్దేశం. బ‌ల‌మైన నాయ‌కుడిగా నెల్లూరు నాయుడు (వెంక‌య్య నాయుడు)కు పేరున్నా ఆయ‌న బాబు క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేస్తార‌న్న పేరుంది. ఒక్క వెంక‌య్య అనే కాదు ఇవాళ ఏపీ బీజేపీ అంతా చంద్ర‌బాబు టీం అని అమిత్ షా న‌మ్మ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.త‌న క్యాబినెట్‌లో బీజేపీకి రెండు మంత్రి ప‌దవులు ఇచ్చినా.. వారిని కూడా న‌డిపేది.. న‌డిపించేంది బాబునే అన్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.

అంతెందుకు పుష్క‌ర ఏర్పాట్ల‌కు సంబంధించి పుర‌పాల‌క మంత్రి నారాయ‌ణ చురుగ్గా ఉన్నారే త‌ప్ప‌! దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు పెద్ద‌గా క‌నిపించిందీ లేదు. తొక్కిస‌లాట త‌రువాత స్పందించిందీ లేదు. పుష్క‌రాల ఏర్పాట్ల‌కు సంబంధించి మంత్రి మాణిక్యాల‌రావుకు బాబు అండ్ కో అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంపై బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బాహాటంగానే అసంతృప్తి వ్య‌క్తంచేశారు.ఇక మ‌రో మంత్రి (శాఖ : వైద్య – ఆరోగ్యం) కామినేని శ్రీ‌నివాస్‌కు కూడా చంద్ర‌బాబు ఏం చెబితే అదే ! ఈ త‌రుణంలో ఏపీ బీజేపీ కొత్త నాయ‌క‌త్వ సార‌థ్యంలోనైనా బ‌ల‌ప‌డే ఛాన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.