అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మనస్సులో మాట

ఏపీ రాజధాని ఏర్పాటుపై గత నాలుగు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి మధ్యలోనే రాజధాని ఉంటుందని ప్రకటించారు. ఆయన మనస్సులో ఎప్పటి నుంచో ఉన్న అంశాన్ని ఆయన గురువారం అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టినట్లయ్యింది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచే ఆయన కన్ను విజయవాడపై ఉంది. గురువారం అసెంబ్లీలో విజయవాడ కేంద్రంగా రాజధానిని నిర్మిస్తామని ఆయన తెలిపారు. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. చంద్రబాబు ఒక్కసారిగా రాజధాని ఏర్పాటును ప్రకటించగానే వైకాపా సభ్యులు గందరగోళం సృష్టించారు. తమకు న్యాయం జరగాలని వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహోద్యులయ్యారు. రాజధాని ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చిద్దామని అంటే వైకాపా సభ్యులు కుదరదని అనడం తప్పని ఆయన అన్నారు. వైకాపా సభ్యులకు సభ, సంప్రదాయాలు తెలియవని ఆయన ధ్వజమెత్తారు. మద్రాసు నుంచి ఆంధ్రరాష్ట్రం వేరుపడినప్పుడు నాటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి ఇంట్లో కూర్చుని పెద్ద మనుషులు కర్నూలును రాజధానిగా ఎంపిక చేశారని ఇప్పుడు అసెంబ్లీలో రాజధాని ఏర్పాటుపై చర్చిద్దామంటే వైకాపా సభ్యులు అడ్డుకోవడం తగదని ఆయన విమర్శించారు. అక్కడ భూసేకరణకు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే విశాఖ, విజయవాడ, తిరుపతిని మెగాసిటీలుగా మరో 14 పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రాజధాని విజయవాడలో ఏర్పాటు చేసినా అభివృద్ధి మాత్రం రాష్ట్రం మొత్తం వికేంద్రీకరిస్తామన్నారు. చంద్రబాబు ప్రకటనతో రాజధాని ఏర్పాటుపై ఎప్పటి నుంచో వస్తున్న ఊహాగానాలకు తెరదించినట్లయ్యింది.

వివిధ జిల్లాలకు చంద్రబాబు ప్రకటించిన వరాల వివరాలు ఇలా ఉన్నాయి:
శ్రీకాకుళం: భావనపట్నం, కళింగపాడు పోర్టుల నిర్మాణం, ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌సిటీ, పారిశ్రామిక నగరం, ఫుడ్ పార్క్, హార్డ్‌వేర్ హబ్
విజయనగరం: గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, గిరిజన వర్సిటీ, ఫుడ్ పార్క్, పారిశ్రామిక నగరం, మెడికల్ కళాశాల
విశాఖ: మెగాసిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఐటీహబ్, మెట్రో, ఐఐఎం, రైల్వేజోన్
తూర్పుగోదావరి జిల్లా: పెట్రోలియం వర్సిటీ, తెలుగు వర్సిటీ, ఐటీ, పారిశ్రామిక కారిడార్, కాకినాడ పోర్టు
పశ్చిమగోదావరి జిల్లా: ఎన్ఐటీ, నర్సాపురం పోర్టు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, సిరామిక్ పరిశ్రమ
కృష్ణా: గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మెట్రోరైల్, ఫుడ్ పార్క్, ఐటీ
గుంటూరు: ఎయిమ్స్, అగ్రికల్చర్ వర్సిటీ, ఎయిర్‌పోర్టు, ఎన్డీఎంఏ, మెట్రోరైల్, టెక్స్‌టైల్, 
ప్రకాశం: దొనకొండలో పారిశ్రామిక కారిడార్, రామయ్యపట్నం పోర్టు ఏర్పాటు, ఒంగోలులో ఎయిర్‌పోర్టు
నెల్లూరు: ఆటోమొబైల్ హబ్, దుగ్గరాజపట్నం పోర్టు, ఎయిర్‌పోర్టు
అనంతపురం: ఉద్యానవన కేంద్రం, స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్క్, టెక్స్‌టైల్ పార్క్, సెంట్రల్ వర్సిటీ
కర్నూలు: విత్తనోత్పత్తి కేంద్రం, స్మార్ట్‌సిటీ, ఎయిర్‌పోర్టు, మైనింగ్‌స్కూల్, పారిశ్రామిక కారిడార్, విత్తనోత్పత్తి కేంద్రం, స్విమ్స్ తరహా ఆసుపత్రి
చిత్తూరు: ఐఐటీ, తిరుపతి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, కుప్పం ఎయిర్‌పోర్టు, ఐఐటీ, ఐటీహబ్, తిరుపతి మెట్రో రైల్ 
కడప: స్టీల్‌ప్లాంట్, పరిశ్రమలు, ఉర్దూ వర్సిటీ, వస్త్ర పరిశ్రమ

మెగాసిటీలు: తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ
స్మార్ట్‌సిటీలు: శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, కర్నూలు