ఇక్రిశాట్ తో ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇక్రిశాట్ తో ప్రభుత్వం శనివారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ(ప్లానింగ్) శ్రీ ఎస్ పీ టక్కర్, ఇక్రిశాట్ తరుపున డైరెక్టర్ జనరల్ శ్రీ డేవిడ్ బెర్గ్విన్ సన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం స్వర్ణాంధ్రప్రదేశ్ 2029 విజన్ లో భాగంగా ప్రాధమిక రంగ అభివృద్ధికి సాంకేతికపరమైన మద్దతును ఇక్రిశాట్ అందిస్తుంది. వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుగణాభివృద్ధి, పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ తదితర వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, మార్కెటింగ్ వసతుల కల్పనలో ఇక్రిశాట్ పాలుపంచుకుంటుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ఆధునిక శాస్త్ర సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టే విషయంలో సహకరిస్తుంది.

ప్రాథమిక రంగంలో ఉత్పాదకత పెంచడం, సూక్ష్మ సేద్యం ద్వారా కరువు పరిస్థితులను నివారించడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం, కోతల అనంతరం పంటల యాజమాన్యం, పంట ఉత్పత్తులకు విలువలు పెంచడం, రైతు నుంచి వినియోగదారుడి వరకు సప్లయి వ్యవస్థను పటిష్టంచేయడం, తదితర అంశాలలో ఇక్రిశాట్ సహకరిస్తుంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఉపయోగించుకుని భూసార చిత్రపటాలను రూపొందించడంలో ఇక్రిశాట్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఏపీలో వ్యవసాయదారులకు ఇక్రిశాట్ అన్ని సాంకేతిక అంశాలలో మద్దతు ఇస్తుంది. ఇక్రిశాట్ కు అనుబంధంగా వున్న ఏడు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు, జాతీయ, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి నాలేడ్జ్ షేరింగ్ చేసుకోవడంలో తోడ్పడుతుంది.

ఒక్కో జిల్లాలో పదివేల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహించి రైతులకు ఆధునిక సేద్యపు విధానాలను తెలియజేస్తుంది. ఉత్పాదకత పెంపు, లాభదాయకత, సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారుచేయడానికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహణకు మార్గదర్శకాలను రూపొందించడంలో, ప్రైవేట్ ఎంటర్ ప్రెన్యూర్స్ ను ప్రోత్సహించడంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యానికి సహకరిస్తుంది.​