తెలుగు సినిమాల్లో ప‌క్క రాష్ట్రం హ‌వా..

ఒక‌ప్పుడు తెలుగు ప‌రిశ్ర‌మ మ‌ద్రాస్ లో ఉండేది. పేరుకు మ‌న సినిమాలు.. మ‌న హీరోలైనా.. పెత్త‌నం మాత్రం త‌మిళోళ్ళ‌దే సాగింది. ఈ పెత్త‌నం త‌ట్టుకోలేకే ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు లాంటి సినీ పెద్ద‌లు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని హైద‌రాబాద్ కు మార్చారు. ఇక అప్ప‌ట్నుంచీ తెలుగు సినిమా అడ్డా భాగ్య‌న‌గ‌ర‌మే. మ‌న సినిమాల‌కు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా హైద‌రాబాద్ లోనే జ‌ర‌ప‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఇక్క‌డ చేస్తే అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతారు. హీరోలు, ఫ్యాన్స్ మ‌ధ్య దూరం కూడా తగ్గుతుంది.

కానీ ఇప్పుడు తెలుగు సినిమా అడ్డా మారుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక్క‌డ జ‌ర‌గాల్సిన వేడుక‌ల‌న్నీ ప‌క్క రాష్ట్రానికి త‌ర‌లి వెళ్లిపోతున్నాయి. తెలుగు రాష్ట్రం కాస్తా.. రాష్ట్రాలుగా మారిపోయిన త‌ర్వాత ద‌ర్శ‌క‌నిర్మాత‌ల చూపు ప‌క్క రాష్ట్రంపై ప‌డుతుంది. తాజాగా బాల‌కృష్ణ న‌టిస్తున్న డిక్టేట‌ర్ ఆడియో డిసెంబ‌ర్ 20న అమ‌రావ‌తిలో జ‌ర‌గ‌నుంది. కొత్త రాష్ట్రం.. కొత్త రాజ‌ధానిలో జ‌ర‌గ‌నున్న తొలి పెద్ద ఈవెంట్ గా డిక్టేట‌ర్ ఆడియో చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది. ఈ ఆడియోకు కావాల్సిన ప‌నుల‌న్నింటినీ ద‌గ్గ‌రుండి మ‌రి చూసుకుంటున్నాడు బాల‌య్య‌. శ్రీ‌వాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఎరోస్ సంస్థ‌తో క‌లిసి శ్రీ‌వాస్ డిక్టేట‌ర్ ను నిర్మిస్తున్నాడు.

బాల‌య్య సినిమా ఈవెంట్ మాత్ర‌మే కాదు.. గోపీచంద్ కూడా ఛ‌లో ఏపీ అంటున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు త‌న ఫంక్ష‌న్స్ అన్నింటినీ హైద‌రాబాద్ లోనే జ‌రుపుకున్న గోపీ.. తొలిసారి సౌఖ్యం సినిమా కోసం ఒంగోల్ వెళ్తున్నాడు. డిసెంబ‌ర్ 13న అక్క‌డే ఆడియో వేడుక జ‌ర‌ప‌నున్నారు. పిల్లా నువ్వులేని జీవితం త‌ర్వాత ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి చేస్తున్న సినిమా ఇది. రెజీనా ఇందులో గోపీచంద్ తో జోడీక‌ట్టింది. ఆనంద ప్ర‌సాద్ నిర్మాత‌. అయితే ఏపిలో ఆడియోలు చేస్తే.. హైద‌రాబాద్ లో ప్లాటినం డిస్క్ చేయ‌డం.. ఇక్క‌డ ఆడియో జ‌రిగితే ఏపిలో స‌క్సెస్ మీట్ పెట్ట‌డం ఇప్పుడు కామ‌న్ అయిపోయింది. మొత్తానికి తెలుగు సినిమాపై కొత్త రాష్ట్రం ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.