సీరీస్ గోవిందా.. ఆస్ట్రేలియా కైవసం.. భారత్ నత్తనడక బ్యాటింగ్‌తో మ్యాచ్ డ్రా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సీరీస్‌లో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కోల్పోయింది. తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయిన భారత్ మూడో టెస్ట్‌ను డ్రా చేసుకుంది. చివరి రోజు 384 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. నత్త నడకబ్యాటింగ్‌తో ఏ దశలోను విజయసాధన కోసం ప్రయత్నించలేదు. రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ధోనీ సేన కేవలం 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (54), అజ్యంకా రహానే (48) జంట నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించడంతో జట్టు కష్టాల నుంచి బయటపడింది. 

భారత ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్‌ధావన్ డక్ అవుట్ అయ్యాడు. రాహుల్ 1, మురళీ విజయ్ 11 పరుగులు సాధించి పెలివియన్‌కు చేరుకున్నారు. మ్యాచ్ చివరి దశలో టీమిండియా మళ్లీ ఒక పరుగు తేడాతో రెండు వికెట్లు కోల్పవడంతో ఈ మ్యాచ్ కూడా కోల్పోతుందా అన్న అనుమానాలు కలిగాయి. అయితే చివరకు ధోనీ(24), అశ్విన్ 8 పరుగులు సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌జాన్సన్, ర్యాన్ హారీస్, హజిల్‌వుడ్‌లకు తలా రెండు వికెట్లు దక్కాయి. భారత్‌కు కాస్త సంతృప్తి ఏంటంటే బాక్సింగ్ డే టెస్టును డ్రాగా ముగించుకోవడం. ఇక మిగిలిన చివరిదైన నాలుగో టెస్టు నామమాత్రంగా మారింది. 
స్కోర్ వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్సింగ్స్- 530
భారత్ తొలి ఇన్సింగ్స్- 465
ఆస్ట్రేలియా రెండో ఇన్సింగ్స్ – 318/9 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్సింగ్స్- 174/6