బాహుబ‌లి ఎక్క‌డి రికార్డులు అక్క‌డ మ‌టాష్..

బాహుబ‌లి నిజంగా బాహుబ‌లే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా త‌న భుజ‌బ‌లాన్ని చూపిస్తున్నాడు బాహుబ‌లి. ఈ సినిమాకు తొలిరోజు వ‌చ్చిన టాక్ కు.. ఇప్పుడు వ‌స్తున్న వ‌సూళ్ళ‌కు ఏ మాత్రం సంబంధం లేదు. తెలుగులోనే కాదు.. విడుద‌లైన ప్ర‌తీచోట స‌రికొత్త రికార్డుల‌తో చ‌రిత్ర సృష్టిస్తుంది బాహుబ‌లి. నైజాంలో నాలుగు రోజుల్లోనే 16 కోట్ల మార్క్ అందుకున్న బాహుబ‌లి.. ఫుల్ ర‌న్ లో 25 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. ఇక సీడెడ్, ఆంధ్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. క‌ర్ణాట‌క‌లో 6 కోట్ల మార్క్ దాట‌డమే తెలుగు సినిమాల‌కు గొప్ప ఫీట్. అలాంటిది ఇప్ప‌టికే బాహుబ‌లి అక్క‌డ 13 కోట్లు దాటేసింది. ఇక ఓవ‌ర్సీస్ లో ద‌క్షిణాది సినిమాల‌కు క‌ల‌గా ఉన్న 3 మిలియ‌న్ మైలురాయిని దాట‌డ‌మే కాదు.. 4 మిలియ‌న్ కూడా దాటేసి 5 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ వైపు ప‌రుగులు పెడుతుంది. ఇండియ‌న్ క‌రెన్సీ ప్రకారం ఇప్ప‌టివ‌ర‌కు బాహుబ‌లి ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్లు అక్ష‌రాలా 28 కోట్లు. గ‌త రికార్డ్ అత్తారింటికి దారేది కంటే ఇది 12 కోట్లు ఎక్కువ‌.

మ‌ళ‌యాలంలోనూ బాహుబ‌లి హ‌వా మామూలుగా లేదు. తొలిరోజు థియేట‌ర్ ఓన‌ర్ల గొడ‌వ కార‌ణంగా 200 థియేట‌ర్స్ లో విడుద‌ల కావాల్సిన బాహుబ‌లి.. కేవ‌లం 50 స్క్రీన్స్ లో మాత్ర‌మే విడుద‌లైంది. కానీ త‌ర్వాత రోజు నుంచి పుంజుకుని ప్ర‌స్తుతం అక్క‌డ స్టార్ హీరోల సినిమాల స్థాయిలో 250 థియేట‌ర్స్ లో ఆడుతుంది. ఇప్ప‌టికే రేసుగుర్రం పేరు మీద ఉన్న 2.5 కోట్ల రికార్డును దాటేసి.. 3 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. ఫుల్ ర‌న్ లో సుల‌భంగా 5 కోట్లు దాటేస్తుంద‌ని అంచ‌నా. ఇక ఈగ‌తో త‌మిళ‌నాట 15 కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టిన రాజ‌మౌళి.. ఇప్పుడు బాహుబ‌లితో అక్క‌డ వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నాడు. క‌మ‌ల్ హాస‌న్ పాప‌నాశం సైతం బాహుబ‌లి ధాటికి తోక ముడ‌వ‌క త‌ప్ప‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ 17 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది బాహుబ‌లి. హిందీలో అయితే రోజురోజుకీ బాహుబ‌లి వ‌సూళ్ళు పెరుగుతున్నాయి. తొలిరోజు 5 కోట్లే వ‌సూలు చేసిన బాహుబ‌లి.. నాలుగోరోజు 6 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు 28 కోట్లు బాలీవుడ్ లో వ‌సూలు చేసి.. సౌత్ సినిమాల్లో రోబో పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది బాహుబ‌లి. మొత్తానికి ఈ హ‌వా ఇలాగే సాగితే ద‌క్షిణాది సినీచ‌రిత్ర‌లోనే బాహుబ‌లి స‌రికొత్త అధ్యాయం లిఖించ‌డం ఖాయం.