బాహుబలి జోరు పెంచిన రాజ‌మౌళి… రికార్డు కొట్టేస్తాడా…

ప్ర‌మోష‌న్ లో జోరు పెంచేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు. చూస్తుండ‌గానే జులై వ‌చ్చేసింది. మ‌రో ప‌ది రోజుల్లో బాహుబ‌లి విడుద‌ల‌. ఈ 10 రోజుల్ని బాగా వాడేయాల‌ని ఫిక్సైపోయాడు రాజ‌మౌళి. హైద‌రాబాద్ టూ ముంబై వ‌యా త‌మిళ‌నాడు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా బాలీవుడ్ పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టాడు రాజ‌మౌళి. ఎలాగూ సౌత్ లో బాహుబ‌లిపై ప్ర‌త్యేక‌మైన ప్ర‌మోష‌న్ అక్క‌ర్లేదు.

ఆకాశ‌మంత అంచ‌నాలే ఈ సినిమాకు శ్రీ రామ‌ర‌క్ష‌. అందుకే ద‌ర్శ‌క‌ధీరుడి ఫోక‌స్ మొత్తం బాలీవుడ్ వైపే. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సౌత్ సినిమాకు రానంత హైప్ బాహుబ‌లికి వ‌చ్చేసింది. దీనికి కార‌ణం ఈగ‌. ఈ క్రేజ్ ను స‌రిగ్గా వాడుకుంటూ బాహుబ‌లిని బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు రాజ‌మౌళి. దీనికి క‌ర‌ణ్ జోహార్ సాయం కూడా తీసుకుంటున్నాడు.

బాలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఏ ద‌క్షిణాది చిత్రం 50 కోట్లు వ‌సూళ్ళు సాధించ‌లేదు. బాహుబ‌లితో ఆ రేర్ ఫీట్ అందుకోవాల‌ని చూస్తున్నాడు రాజ‌మౌళి. త‌మ మూడేళ్ల క‌ష్టాన్నంతా ఈ ప‌దిరోజుల ప్ర‌మోష‌న్ లో చూపించేయ‌డానికి సిద్ధ‌మైపోతున్నారు బాహుబ‌లి సైనికులు.