రివ్యూ – బాహుబ‌లి సమీక్ష

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబ‌లి తెలుగు సినిమా రేంజ్‌ను, చ‌రిత్ర‌ను మారుస్తుంద‌ని… రిలీజ్‌కు ముందు నుంచే ఎన్నో అంచ‌నాలు, రికార్డుల‌న్ని తిర‌గ‌రాస్తుంద్న చ‌ర్చ‌లు. సినిమా ఎప్పుడ విడుదలౌతుందా అని సినీ ప్రేక్ష‌కులు ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రీమియర్ షోల హడావిడి. మీడియా నిరసనలు.. సెల‌బ్రిటీలు బ్లాక్ లో టిక్కెట్లు కొనడం…వార్నింగ్ లు, కోర్టు కేసులు.. లాంటి హంగామా నడుమ ఈ సినిమా రిలీజైంది. భారతదేశం గర్వించదగ్గ చిత్రం అవుతుందని రిలీజ్ కు ముందే పెద్దలంతా రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశారు. బాలీవుడ్ స్టార్స్ సైతం బాహుబలి కోసం ఎదురుచూశారంటే అర్థం చేసుకోవచ్చు. రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్నఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల‌ను అందుకుందా లేదా అన్న‌ది ప‌ల్లిబ‌ఠాని.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

బాహుబలి కథేంటంటే…

శివుడు (ప్ర‌భాస్‌) మాహిస్మ‌తి రాజ్యానికి స‌మీపంలో ఉన్న గూడెంలో పెరుగుతుంటాడు. జ‌ల‌పాతాల మీద విన్యాసాలు, అపురూప‌మైన తెలివితేట‌లు, అద్భుత‌మైన విలుకాడు అయిన శివుడు అవంతిక (త‌మ‌న్నా)తో ప్రేమ‌లో ప‌డి ఆమెను వెతుకుతూ వెళ్లిపోతాడు. భల్లాల దేవ చెరలో బందీగా ఉన్న దేవ‌సేన (అనుష్క‌)ను బయటికి తెచ్చేందుకు అవంతిక కష్టపడుతుంటుంది. ఆ బాధ్యతను శివుడు తీసుకొని మాహిష్మ‌తి రాజ్యానికి వెళ‌తాడు. దేవసేన తన తల్లే అని… అక్క‌డ రాజుగా అరాచ‌కాలు సృష్టిస్తున్న భ‌ల్లాల‌దేవుడు (రానా ద‌గ్గుపాటి) త‌న తండ్రిని చంపి త‌ల్లిని 25 సంవ‌త్స‌రాలుగా బందీగా చేశాడ‌న్న నిజం తెలుసుకుంటాడు శివుడు. త‌న తండ్రికి న‌మ్మిన బంటు అయిన సేనాధిప‌తి క‌ట్ట‌ప్ప (స‌త్య‌రాజ్‌) వ‌ల్ల శివుడు తెలుసుకున్న భయంక‌ర‌మైన నిజాలు ఏమిటి ? మ‌హిష్మ‌తి రాజ్యంలో భ‌ల్లాల‌దేవుడు అమ్మ అయిన శివ‌గామి (ర‌మ్య‌కృష్ణ‌) త‌న కొడుకు భ‌ల్లాల‌దేవుడిని కాద‌ని స‌వ‌తి కొడుకు బాహుబ‌లి(ప్ర‌భాస్‌)ని ఎందుకు రాజును చేసింది? అవంతిక భ‌ల్లాల‌దేవుడిపై ఎందుకు ప‌గ‌తో ర‌గిలి పోతోంది? అసలు బాహుబలి కథేంటి. ఇలాంటి విషయాలు తెలియాలంటే… తెరమీదే చూడాలి.

న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌:

ప్ర‌భాస్ – ప్రభాస్ కెరీర్ లో బాహుబలి మరిచిపోలేని సినిమాగా మిగులుతుంది. అయితే పెర్ ఫార్మెన్స్ గురించి మాత్రం కాదు. దాదాపు మూడు సంవత్సరాలు ఓ సినిమా కోసం కేటాయించాడు. ఈ విషయంలో హీరోను మెచ్చుకోకుండా ఉండలేం. ఇక సినిమాలో తన పాత్రల కోసం ఫిజికల్ గా బాగా ఫిట్ గా కనిపించాడు. శివుడిగా, బాహుబలిగా రెండు పాత్రల్లోనూ ఒదిగి పోయాడు. అయితే పవర్ ఫుల్ పెర్ ఫార్మెన్స్ చూపించే స్కోప్ రాజమౌళి కల్పించలేదు. ఇన్ని రోజులు ప్రభాస్ ప్రభాస్ అని తలచిన వారు కూడా… ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి తేలిపోయినట్టుంది అనే కామెంట్ చేస్తున్నారు. బహుషా రానా క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల కావచ్చు. ప్రభాస్ ముందు తమన్నా మరీ చిన్నపిల్లలా కనిపించింది. ఈడు జోడు కుదరలేదు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించేంత బలమైన సన్నివేశం లేకపోవడం వల్ల కావచ్చు… ఇద్దరు మాట్లాడుకునే విధానం కావచ్చు… అద్భుతమైన జంటగా ముద్ర వేయలేని పరిస్థితి. ఇక ప్రభాస్ కత్తి బాగా తిప్పడంలో సక్సెస్ అయ్యాడు. యుద్ధం బాగా చేశాడు. అయితే గత సినిమాల్లో ప్రభాస్ ఫైట్లు చేస్తే…వెంట్రుకలు నిక్కబొడుచుకునేవి. కానీ ఈ చిత్రంలో ప్రభాస్ యుద్ధం కంటే…. కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయాజాలం డామినేట్ చేసింది. ఓవరాల్ గా ప్రభాస్ వెచ్చించిన సమయానికి, పట్టుదలకు, కృషికి, హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.

రానా – బాహుబలి మొదటి భాగంలో రానా చెలరేగిపోయాడు. భళ్లాల దేవుడి పాత్రకు రానా సరిగ్గా సరిపోయాడు. చాలా సన్నివేశాల్లో తన క‌ళ్ల‌తోనే క్రూర‌త్వాన్ని చూపించాడు. యుద్ధ‌వీరుడిగా కూడా బాహుబ‌లితో స‌మానంగా మెప్పించాడు. ప్రభాస్ కంటే కూడా రానా ఇంట్రడక్షన్ బిల్డప్ సీన్ బాగుంది. యాక్షన్ పార్ట్ లోనూ రానా బాగా కనిపించాడు. వేల మంది సైన్యం మధ్యలో రానా స్పెషల్ గా కనిపించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో రానా పెర్ ఫార్మెన్స్ ప్రభాస్ కంటే బాగుంది.  

అనుష్క, తమన్నా – తమన్నా తన పాత్రకు అస్సలు కుదరలేదు. భళ్లాలదేవ లాంటి పవర్ ఫుల్ విలన్ చేరనుంచి దేవసేనను తీసుకొచ్చేంత పర్సనాలిటీ తమన్నాకు లేదు. నిజంగా చెప్పాలంటే ఎలుక పిల్లలా కనిపించింది. చిన్న పిల్లలా కనిపించడంతో ప్రభాస్ ముందు తేలిపోయింది. తమన్నా ప్లేస్ లో మరో అమ్మాయిని తీసుకోవాల్సింది. ప్రభాస్ హ్యూజ్ బాడీకి తగ్గట్టుగా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సింది. ఇక అనుష్క చాలా కొద్దిసేపే ఉందని ఫీలయ్యే వాళ్లకు గుడ్ న్యూస్. ఆమెను కొద్దిసేపు చూడటమే కష్టంగా అనిపించింది. అనుష్క మేకప్ కూడా సరిగ్గా లేదు. ఇక రెండో భాగంలో ఎలా ఉంటుందో చూడాలి.

రమ్యకృష్ణ – శివగామి గా రమ్యకృష్ణ పర్ ఫెక్ట్ ఛాయిస్. తన క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేందుకు బాగా కష్టపడింది. ఓవరాల్ గా రమ్యకృష్ణ క్యారెక్టర్ కు మంచి పేరొస్తుంది.

సత్యరాజ్, నాజర్, అడవి శేష్, ప్రభాకర్ పాత్రలు బాగున్నాయి. బాగా కష్టపడ్డారు.

 
సాంకేతిక నిపుణుల ప‌నితీరు:

రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ గురించి…ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. అయితే బాహుబలి విషయంలోనే తప్పటగుడు పడింది. చాలా సంవత్సరాలు సమయం కేటాయించడం వల్ల కావచ్చు… ఎక్కువ ట్యూన్స్ తయారు చేయారు చేసి…కన్ఫ్యూజన్ లో సరైన సాంగ్స్ ఎంచుకోలేక పోయారు. ఒక్క పాట కూడా వినసొంపుగా లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. కనీసం ఐటం సాంగ్ అయినా పాడుకునేలా ఊపు మీద ఉంటుందనకుంటే తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇక రీ రికార్డింగ్ విషయానికి వస్తే… సన్నివేశానికి పొంతన లేకుండా ఉంది. ఓ సీన్ ఎలివేట్ కావాలంటే కీరవాణి ని మించినోడు లేడు అని గత సినిమాల్లో చెప్పుకున్నాం. కానీ రోమాలు నిక్కబొడుచుకునే ఆర్ ఆర్ ఇవ్వడంలో గట్టిగా విఫలమయ్యాడు. ఎమోషనల్ సీన్స్ ని పండించడంలో కీరవాణి ది బెస్ట్. బట్ అనుకున్న స్థాయిలో రీ రికార్డింగ్ ఇవ్వలేక పోయాడు.  

ఇక బాహుబలి నిజంగానే విజువల్ వండరా… అంటే కాదనే చెప్పాలి. అయితే తక్కువ చేసి చెప్పలేం. చాలా వరకు నటీనటుల కంటే విజువల్ గ్రాఫిక్స్ బాగున్నాయి. వాటర్ ఫాల్స్, యుద్ధాలు, కోటలు బాగా చూపించగలిగారు. ఇంత కంటే ఎక్కువగా మాట్లాడుకునేంత అత్యద్భుతమైన విజువల్స్ లేవు. ఉన్నా… చాలా సినిమాల్లోంచి కాపీ, ఇన్ స్పైర్ అయిన సీన్లే. ఓ విజువ‌ల్ వండ‌ర్ సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బాహుబ‌లిలో సెట్స్, గ్రాఫిక్స్ ఓకే. దున్నతో రానా ఫైటింగ్ లాంటి గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయి. మ‌హిష్మ‌తి రాజ్యం సెట్టింగుల కోసం సాబు సిరిల్ ప‌డిన క‌ష్టం మ‌న‌కు క‌నిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సెంథిల్ కెమెరా పనితనం ఓకే. ఈ సినిమాలో గ్రాఫిక్స్ డామినేట్ చేయడంతో సెంథిల్ వర్క్ ఎలివేట్ కాలేదు.

సమీక్ష
ఊరించాడు… ఊరించాడు… ఏకంగా జనాల జేబులు చిల్లులు పడేలా… స్టార్స్ సైతం బ్లాక్ లో టిక్కెట్లు కొనేంతగా.. ఆర్టిస్టులకు సైతం విసుగు వచ్చేంతగా… వెయిట్ చేయించి మరీ బాహుబలిని వదిలాడు.
సినిమాకు ఎంత ఖర్చు పెట్టారన్నది సగటు ప్రేక్షకుడికి అనవరసం…
సినిమాకు ఎన్ని రోజులు వెచ్చించామన్నది ఆడియెన్స్ కు అఖ్కర్లేదు…
సినిమా కోసం అష్టకష్టాల కోర్చాం అనే డైలాగ్స్ పబ్లిక్ పట్టించుకోదు…
సో…రాజమౌళికి బాహుబలి ఒరిజినల్ టాక్ తెలుసుకున్న తర్వాత బోధపడి ఉంటుంది. ఇన్ని రోజుల వెయిటింగ్ తర్వాత అద్భుతాలే ఆశిస్తారు. ఇంత కాలం నిరీక్షణ తర్వాత సోసో సినిమా సినిమా తీస్తారని అస్సలూహించరు. అందులో అపజయమెరుగని రాజమౌళి దర్శకత్వం కావడంతో…అంచనాలు తారాస్థాయిలోనే ఉంటాయి. అయితే ఆ అంచనాల్ని రాజమౌళి అందుకోవడంలో ఈసారి సఫలం కాలేకపోయాడు. భారీ కథ అయితే రెండు భాగాలు తీసినా అర్థం ఉంటుంది. మొదటి భాగంలో సరైన కథే లేదు… దీని కోసం రెండో భాగం తీయాలని ఎందుకనుకున్నారో. పాత్రల పరిచయాన్ని సరిగ్గా ఇవ్వలేకపోయాడు. బాహుబలి ఫ్యామిలీ గురించి రెండో భాగంలో చెబుదాంలే అనుకుంటే పెద్ద పొరపాటు చేసినట్టే. రాజులు-రాజ్యాలు-వెన్న‌పోట్లు-యుద్ధం ఈ లైన్‌తో దాదాపు నాలుగు ద‌శాబ్దాల క్రింద నుంచే సినిమాలు వ‌స్తున్నాయి. మ‌ళ్లీ అలాంటి లైన్‌నే మార్పులు లేకుండా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కథ అందిస్తే… గొప్ప కథ అని ఎలా చెబుతాం. సీరియస్ గా నడుస్తున్న కథలో… ఐటమ్ సాంగ్ పెట్టాలని ఎందుకనిపించిందో అర్థం కాని విషయం. ప్రభాస్, తమన్నా మధ్య కెమిస్ట్రీ అస్సలు కుదరలేదు. డైలాగ్స్ కూడా అందరికీ అర్థమయ్యేలా లేవు. చెప్పుకో దగ్గ పవర్ ఫుల్ డైలాగ్స్ లేనే లేవు. మెయిన్ స్టోరీలోకి వచ్చేందుకు బాగా సాగ దీశాడు. కొద్దిసేపు వార్ సీన్లతో హడావిడి చేశాడు తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇలా రాసుకుంటూ పోతే చాలా విషయాల గురించి చర్చించుకోవాలి.

ఫ్ల‌స్‌లు
విజువల్స్
యుద్ధ స‌న్నివేశాలు
రానా, రమ్యకృష్ణ పెర్ ఫార్మెన్స్

మైన‌స్‌లు
చాలానే ఉన్నాయి…

ఫైన‌ల్‌గా…

తెలుగు సినిమా స్థాయిని పెంచుతుంద‌ని..ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేస్తుంద‌ని…రికార్డుల‌కే స‌రికొత్త భాష్యం చెపుతుంద‌ని భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన బాహుబ‌లి బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం చతికిలి పడింది. మొదటి రోజు హడావిడి మాత్రమే. ప్రేక్ష‌కుల భారీ అంచ‌నాల‌ను జ‌క్క‌న్న ఏ మాత్రం అందుకోలేకపోయాడు. ఈ సినిమా కోసమేనా మూడున్న‌రేళ్లు క‌ష్ట‌ప‌డింది అన్న ఫీలింగ్ కూడా ప్రేక్ష‌కుల‌కు క‌ల‌గ‌క మాన‌దు. ఓవ‌రాల్‌గా అంచ‌నాల‌కు అందుకోలేని బాహుబ‌లిగా టాలీవుడ్ చ‌రిత్ర‌లో మిగిలిపోయింది.

పల్లీ బఠానీ పంచ్ – భలేగా బలి చేశారు…
PalliBatani Rating 2/5.