బాబాయ్ కొడుకుల వార్-మధ్యలో ఎన్టీఆర్ సవాల్

సంక్రాంతి సినిమా పోరు మహా రంజుగా ఉండబోతోంది. పవన్-విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్లో వస్తున్న గోపాలా.. గోపాలా మల్టీస్టారర్ మూవీ సంక్రాంతి బరిలో ఉండనుంది. ఇక నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ఎంట్రీ చిత్రం ముకుంద తొలుత డిసెంబర్ 24న విడుదల చేయాలని అనుకున్నా ఆ చిత్రం ఆలస్యమైంది. దీంతో ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలోనే నిలపాలని నిర్మాతలు యోచిస్తున్నారు. గతంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు కూడా సంక్రాంతికే విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ తన సినిమా ముకుందపై ఉన్న నమ్మకంతో ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికే విడుదల చేయాలని పట్టుబడుతున్నాడట.

సంక్రాంతి పందెం రేసులో బాబయ్ పవన్, అబ్బాయ్ వరుణ్ ఉంటే ఇక యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా వీరికి సవాల్ విసురుతున్నాడు. ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం (వర్కింగ్ టైటిల్ టెంపర్) చిత్రం కూడా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేస్తున్నట్టు నిర్మాత గణేష్ ఎప్పుడో ప్రకటించేశాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. మరి ఈ సంక్రాంతి పందెంలో ఏ హీరో గెలుస్తాడో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.