బాహుబ‌లిని దాటిపోయిన బాజీరావ్ మ‌స్తానీ..

నిజంగా బాహుబ‌లి గొప్ప సినిమాయేనా..? ఏంటి.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 500 కోట్లు కొల్లగొట్టిన సినిమా.. పైగా అన్ని భాష‌ల్లోనూ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సినిమాను ప‌ట్టుకుని గొప్ప సినిమానా అని ఆశ్చ‌ర్యంగా అడుగుతున్నారు అనుకుంటున్నారా..? కానీ నిజంగానే ఈ ప్ర‌శ్న ఇప్పుడు రేకెత్తుతుంది. బాహుబ‌లి గొప్ప సినిమాయేనా..? అంటే క‌చ్చితంగా కాద‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది. దీనికి కార‌ణం బాజీరావ్ మ‌స్తానీ. ఈ సినిమా చూసిన త‌ర్వాత బాహుబ‌లి గొప్ప‌త‌నంపై అనుమానాలు వ‌స్తున్నాయి.

బాహుబ‌లి అనేది ప్యూర్ ప‌క్కా మాస్ మాసాలా ఎంట‌ర్ టైన‌ర్. ఇందులో క‌ళాత్మ‌క విలువ‌లు మ‌చ్చుకైనా క‌నిపించ‌వు. ఉన్నదంతా క‌మ‌ర్షియ‌ల్ మాయాజాల‌మే. క‌లెక్ష‌న్ల కోసం రాజ‌మౌళి చేసిన మాయాజాల‌మే బాహుబ‌లిలో క‌నిపిస్తుంది. ప్యాష‌న్ కంటే వ‌సూళ్ల‌పైనే దృష్టిపెట్టి బాహుబ‌లిని ఓ మ‌నీ మిష‌న్ గా వాడేసుకున్నాడు రాజ‌మౌళి. ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి.. బాహుబ‌లికి ఫ్రీ ప‌బ్లిసిటీ పొందాడు. అంతేకాదు.. ఒక్క రూపాయి కూడా యాడ్స్ ఇవ్వ‌కుండా.. అన్ని ఛానల్స్ నుంచి ఫ్రీ పబ్లిసిటీ అందుకున్న ఏకైక ఇండియ‌న్ సినిమా బాహుబ‌లే.

బాహుబ‌లి అనేది ప‌క్కా మార్కెటింగ్ స్ట్రాట‌జీతో హిట్టైన సినిమా. తొలిభాగం చూసిన వాళ్లెవ్వ‌రూ అబ్బో అద్భుతం ఈ సినిమా అని అన‌లేదు. కేవ‌లం ఒక్క‌సారి విజువ‌ల్ గ్రాండియ‌ర్ కోసం చూడొచ్చ‌న్నారు. సినిమాలో విష‌యం కంటే విజువ‌ల్ నే ఎక్కువ‌గా న‌మ్ముకున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. అందుకే బాహుబ‌లి క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం సాధించింది గానీ తెలుగు ప్రేక్ష‌కుల నుంచి పూర్తిస్థాయి మ‌ద్ద‌తు అందుకోలేక‌పోయింది. ఇది మ‌న సినిమా.. మ‌న ద‌ర్శ‌కుడు అనే ఫీలింగ్ తోనే బాహుబ‌లి సంచ‌ల‌నం సృష్టిచింది.

ఇదే స‌మ‌యంలో బాజీరావ్ మ‌స్తానీ విష‌యానికొస్తే.. ఇందులో విజువ‌ల్ గ్రాండియ‌ర్ తో పాటు సినిమాపై ద‌ర్శ‌కుడికి ఉన్న ప్యాష‌న్ క‌నిపిస్తుంది. మార్కెటింగ్ స్ట్రాట‌జీ కంటే క‌ళాత్మ‌క విలువ‌లు తెర‌పై క‌నిపిస్తాయి. సినిమాలో ప్ర‌తీ పాత్ర‌కు ద‌ర్శ‌కుడు ఇచ్చిన ప్రాముఖ్య‌త‌.. దాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ర‌ణ్ వీర్ సింగ్, దీపిక‌, ప్రియాంక చోప్రాల పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌తో ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవుతాయి. బాహుబ‌లిలో ఇలాంటి పాత్ర ఒక్క‌టి కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అన్నీ క‌మ‌ర్షియ‌ల్ పాత్ర‌లే.. ప్లాస్టిక్ ఎమోష‌న్సే. అందుకే బాజీరావ్ మ‌స్తానీని చూసిన త‌ర్వాత బాహుబ‌లి కూడా చిన్న‌గా క‌నిపిస్తుంది. బాలీవుడ్ జ‌నాలైతే బాజీరావ్ మ‌స్తానీ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. ఇంత‌టి క‌ళాఖండం తెర‌కెక్కించిన సంజ‌య్ లీలా భన్సాలీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

కావాల‌నుకుంటే బాజీరావ్ మ‌స్తానీని కూడా బాహుబ‌లి స్థాయిలో ప్ర‌తీ ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడు హైప్ చేయొచ్చు. కానీ రాజ‌మౌళి మాదిరి ఇలా మార్కెటింగ్ స్ట్రాట‌జీని భ‌న్సాలీ ఫాలో అవ్వ‌లేదు. కేవ‌లం క‌థ‌ను న‌మ్మి సినిమా తీసాడు.. విజ‌యం సాధించాడు. విజువ‌ల్ ట్రీట్ అందించాడు. కానీ బాహుబ‌లి మాత్రం విషయం కంటే విజువ‌ల్స్, మార్కెటింగ్ స్ట్రాట‌జీతోనే విజ‌యం సాధించింది. మొత్తానికి ఈ రెండు సినిమాల‌ను ప‌క్క‌ప‌క్క‌న బెట్టి చూస్తే మాత్రం బాజీరావ్ మ‌స్తానీ కాస్త ఎడ్జ్ తీసుకుంటుంది. ఈ సినిమా చూసిన త‌ర్వాతైనా.. బాహుబ‌లి 2ని రాజ‌మౌళి క‌థ‌లో ఇంకాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడో లేదో చూడాలి.