దసరాకు బాలయ్య 99వ సినిమా… టైటిల్, హీరోయిన్ ఫిక్స్

యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం లయన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ముగింపు దశలో ఉంది. కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించే (వర్కింగ్ టైటిల్ డిక్టేటర్) సినిమాలో నటించనున్నాడు. 

మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఏకధాటిగా షూటింగ్ జరిపి దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార జోడీ కడుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహ, శ్రీరామరాజ్యం సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. 

ప్రముఖ బాలీవుడ్ పంపిణీ సంస్థ ఏరోస్ తొలిసారిగా ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. అంతేకాకుండా దర్శకుడు శ్రీవాస్ కూడా ఏరోస్‌తో కలిసి పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నారు. కోనవెంకట్-గోపీ మోహన్ రచన చేసే ఈ సినిమాలో బాలయ్య మాఫియాడాన్‌గా కనిపిస్తారని సమాచారం. 

ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్, ఢిల్లీ, యూరప్‌లో కంటిన్యూగా పూర్తి చేయనున్నారు. ఎస్ఎస్.థమన్ సంగీతం అందించనున్నాడు.