అల్లరి నరేష్ బందిపోటు రిలీజ్ డేట్

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం బందిపోటు సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ఎనౌన్స్ చేశారు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. బందిపోటులో అల్లరి నరేష్ సరసన అంతకు ముందు ఆ తర్వాత ఫేం ఇష కథానాయికగా నటించింది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బందిపోటు ఆడియో ఇటీవలే విడుదలైంది. కళ్యాణ్ కోడూరి స్వరాలందించారు. అల్లరి నరేష్ బందిపోటులో ఘరానాదొంగగా నటించనున్నారు. 

బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ స్పెషల్‌సాంగ్‌తో పాటు కొన్ని సీన్లలో నటించింది. ఈవీవీ సినిమా పతాకంపై అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మించారు. ఈవీవీ బ్యానర్‌లో ఈవీవీ సత్యనారాయణ కాకుండా బయట దర్శకుడితో ఓ సినిమా నిర్మించడం ఇదే ప్రథమం. ఈ సినిమాను రూ.10 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్యన్ రాజేష్ నిర్మించారు. అలాగే పాటలను విదేశాల్లో అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా నరేష్ స్టైల్లో కామెడీ తరహాలో ఉంటుందని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని సమాచారం. ఇదే టైటిల్‌తో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా 1968లో వచ్చిన బందిపోటు సినిమా హిట్ అయ్యింది.