భలే మంచి చౌక బేరమ్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ – హీరోయిన్ యామినీ భాస్కర్

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌, ‘పంతం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ ‘భలే మంచి చౌక బేరమ్‌’ చిత్రాన్ని సమర్పించడం విశేషం. నవీద్‌, ‘కేరింత’ నూకరాజు, యామిని భాస్కర్‌ కీలక పాత్రలు పోషించారు. గురువారం యామినీ భాస్కర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరోయిన్ యామిని భాస్కర్ ఇంటర్వ్యూ విశేషాలు….

మీ కెరీర్ ఎలా కొనసాగుతోంది…

నాలుగు సినిమాల ప్రయాణంలో కథానాయికగా చాలా విషయాలు నేర్చుకొన్నా. వ్యక్తిగతంగా కూడా ఎంతో పరిణతి సాధించా. నటన పరంగా అన్ని రకాల పాత్రల్లో కనిపించాలనేదే నా అభిమతం.

భలే మంచి చౌక బేరమ్ లో ఎలాంటి పాత్ర పోషించారు.
నా వ్యక్తిత్వానికి బాగా దగ్గరైన పాత్ర చేసే అవకాశం ‘భలే మంచి చౌక బేరమ్‌’తో కలిగింది. ఇందులో నా పాత్ర పేరు ఆదర్శి. ఎదుటి వాళ్లు సమస్యల్లో ఉన్నారంటే వెంటనే కరిగిపోతుంది. అందుకోసం ఏం చేయడానికైనా వెనకాడదు. అలాంటి అమ్మాయి మనసుని తెలుసుకొన్న ఇద్దరబ్బాయిలు ఏం చేశారు? వాళ్ల వల్ల ఈ అమ్మాయి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయనేది తెరపైనే చూడాలి. స్వతహాగా నేనూ ఎదుటి వ్యక్తులు కష్టాల్లో ఉన్నారంటే తట్టుకోలేను. అయితే నిజ జీవితంలో నన్నెవ్వరూ మోసం చేయలేదు కానీ… ఈ సినిమాలో మాత్రం మోసపోతాను. అదెలా అనేదే ఆసక్తికరం. ఆద్యంతం హాస్యభరితంగా సాగే చిత్రమిది. నేను కామెడీ చేయను కానీ… నా చుట్టూ కామెడీ నడుస్తుంటుంది. స్వతహాగా నాకూ హాస్య ప్రధానమైన పాత్రలంటే ఇష్టం. ఈ సినిమాని ఆద్యంతం ఆస్వాదిస్తూ నటించా.

మారుతి లాంటి దర్శకుడు ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నారు….
కథ బాగుంటే అందులో అన్నీ బాగుంటాయని నా నమ్మకం. అందుకే మొదట కథని దృష్టిలో ఉంచుకొనే సినిమాల్ని ఎంపిక చేసుకొంటా. దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొన్న చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్‌’. మారుతి సినిమాల్లో హాస్యానిదే పెద్దపీట. దర్శకుడు మురళీకృష్ణ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. తప్పకుండా ఓ మంచి విజయాన్ని అందించే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది.

ఈ మధ్య మీరు నటించిన నర్తన శాల చిత్రం ఎలాంటి సంతృప్తి ఇచ్చింది.
నర్తనశాల కంటే ముందే చేసిన సినిమా ఇది. ‘నర్తనశాల’లో నేను కనిపించిన విధానంపై సంతృప్తిగా ఉన్నా. ఒక్కో చిత్రంతో కొత్త విషయాలను నేర్చుకుంటున్నా. కథానాయికగా అన్ని రకాల పాత్రల్లో కనిపించాలని కోరుకొంటా.

ఏమైనా కొత్త సినిమాలు ఒప్పుకున్నారా….
కొత్తగా తెలుగులో ఒప్పుకొన్న సినిమాలేమీ లేవు. తమిళంలో ఓ చిత్రం చేశా. తెలుగు, తమిళ భాషల్లో మంచి కథల్ని ఎంపిక చేసుకొంటూ ప్రయాణం చేస్తా.