బాలీవుడ్ తరహా కథల్ని మన దర్శకులు రాయట్లేదు : భూమిక

సమంత ప్రధాన పాత్రలో నటించిన యూ టర్న్ చిత్రానికి పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అలానాటి అందాల హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటించింది. మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత భూమిక నటించిన సినిమా కావడంతో యూటర్న్ కి మంచి బజ్ వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో భూమిక చెప్పిన విశేషాలు….

యూటర్న్ సినిమాలో చేయడం ఎలా అనిపించింది…
హారర్‌ కంటే కూడా థ్రిల్లర్‌ కథలంటేనే నాకు ఇష్టం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి ‘యూటర్న్’ చిత్రం తెరకెక్కించారు దర్శకుడు పవన్‌ కుమార్‌. నేను పాత్రని అర్థం చేసుకుని నా శైలిలో నటిస్తూనే, దర్శకుడికి కావల్సినట్టుగా కనిపించే ప్రయత్నం చేస్తా. రీమేక్‌ సినిమా చేస్తున్నప్పుడు ప్రతి చోటా ఐదు శాతం మార్పు ఉంటుంది. ఈ చిత్రం కూడా అలాంటి మార్పులతోనే తెరకెక్కింది.

గతంలో మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో చేశారు. యూటర్న్ కూడా అలాంటిదే…. యూటర్న్ ప్రత్యేకతలేంటి…
తొలినాళ్లలో నేను కూడా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించాను. ‘యూ టర్న్’ కథ వినగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇదివరకు చేసిన అన్ని పాత్రలకంటే భిన్నంగా కనిపిస్తా. ఒక నటికి విభిన్నమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు లభించే తృప్తే వేరు. అందుకే ఈ కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. కన్నడలో విడుదలైన ‘యు టర్న్‌’ చిత్రం కూడా చూశా. దానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో నా పాత్ర చాలా బాగుంటుంది. అదేంటన్నది తెరపైనే చూడాలి.

బాలీవుడ్ లో పెళ్లైన టాప్ హీరోయిన్స్ ఇంకా నటిస్తున్నారు… మీరు చాలా తక్కువగా కనిపిస్తున్నారు….
హిందీలో ‘తుమ్హారీ సులు’ లాంటి చిత్రాలొచ్చినట్టుగా, తెలుగులోనూ ఆ తరహా కథల్ని దర్శకులు రాయాల్సి ఉంది. విద్యాబాలన్‌ వయసు 42 ఏళ్లు. ఆ వయసు మహిళ నేపథ్యంలోనే ఓ గొప్ప చిత్రం రూపొందిందంటే కారణం అక్కడి రచయితలే. మలైకా అరోరా ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌, జ్యోతిక తదితరులు నలభయ్యేళ్ల వయసు దాటినప్పటికీ మంచి కథల్లో నటిస్తున్నారు. అది మంచి పరిణామం. తెలుగులో కూడా త్వరలోనే ఆ మార్పు వస్తుందని నమ్ముతున్నా. తెలుగు ప్రేక్షకులు వాణిజ్య ప్రధానమైన చిత్రాల్ని ఇష్టపడతారు. దాంతో నిర్మాతలు కూడా ఆ తరహా కథలపైనే మక్కువ చూపుతుంటారు. పెట్టిన డబ్బు తిరిగి రావాలంటే ఆర్థిక సూత్రం ప్రకారం ఆలోచించాల్సిందే కదా! అయితే పెద్ద నిర్మాతలు ఒక పక్క వాణిజ్య ప్రధానమైన చిత్రాలు చేస్తూనే, మరో పక్క ఇలాంటి విభిన్నమైన కథలతో చిత్రాలు చేస్తే ఫలితాలుంటాయి.

మీ ఫ్యూచర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు….
ప్రస్తుత నట ప్రయాణం పరంగా నా లెక్కలు నాకున్నాయి. పాత్రల్ని, కథల్ని, దర్శక నిర్మాతల్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తున్నా. నాకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. తనని కూడా దృష్టిలో ఉంచుకుని, ఆసక్తికరమైన కథలు లభించినప్పుడు వాటిలో భాగమవుతున్నా. సినిమా విషయంలో ఎప్పుడూ నేనొక స్కూల్‌కి వెళ్లే విద్యార్థినిలాగే ఆలోచిస్తుంటా. ఉదయం సెట్‌కి వెళ్లడం, శ్రద్ధగా పనిచేయడం, సాయంత్రం తిరిగి ఇంటికి రావడం. మళ్లీ ఆ సినిమాల గురించి, పని గురించి ఇంట్లో అస్సలు మాట్లాడుకోం.

మీ కేరీర్ ను ఓసారి ఎనలైజ్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది….
వచ్చే ఏడాదికి నా సినీ ప్రయాణం మొదలై ఇరవయ్యేళ్లవుతుంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో కథలు, పరిశ్రమ, మనుషులు… ఇలా అన్నింట్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరింత పరిణతితో ఆలోచిస్తున్నా. ఎన్ని సినిమాలు చేస్తున్నామని కాకుండా, మంచి కథలో భాగమవుతున్నామా? లేదా? అనేది ముఖ్యం. ప్రస్తుతం హిందీలో ‘ఖామోషీ’ అనే చిత్రం చేస్తున్నా. అందులోనూ నాది ఎప్పుడూ చేయని ఓ విభిన్నమైన పాత్రే.

యూ టర్న్ లో సమంత తో కలిసి నటించారు కదా… ఆమె గురించి చెప్పండి..
‘పాత్ర నిడివి ఎంతనేది ముఖ్యం కానే కాదు. మనం చేసిన పాత్ర ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదే కీలకం. అదే ప్రామాణికంగా తీసుకుని నేను సినిమాలు చేస్తుంటా. ‘యూటర్న్‌’ చిత్రంలో సమంత చాలా బాగా నటించింది. ఆమె నటనలో గాఢత ఉంటుంది. శక్తివంతమైన నటి. తన హావభావాలు కూడా చాలా బాగుంటాయి. ఆమె నటించిన ‘ఈగ’, ‘రంగస్థలం’ చిత్రాలు చూశా. ఆమె కళ్లు బలంగా ఉంటాయి. అప్పటికప్పుడు శక్తి కూడగట్టుకొని నటిస్తుంటుంది.