దావోస్ లో ఏపీ సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ విందు

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గౌర‌వార్ధం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ శుక్ర‌వారం రాత్రి దావోస్‌లో విందు ఇచ్చారు. బిల్‌గేట్స్ తో 40 నిమిషాల పాటు ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్య‌, యాప్స్‌, సాఫ్ట్ వేర్ అభివృద్ధి, ఆరోగ్యం, ఇమ్యునైజేష‌న్ అంశాల‌లో స‌హ‌క‌రిస్తాన‌ని బిల్‌గేట్స్ సీయంకు హామీఇచ్చారు. రాష్ట్రంలో ప్ర‌త్యేకంగా మైక్రోసాఫ్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి కోర‌గా, ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు.

       చంద్ర‌బాబు దావోస్ వ‌చ్చార‌న్న స‌మాచారం అంద‌గానే గురువారం రాత్రే ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యేందుకు బిల్‌గేట్స్ ప్ర‌య‌త్నించారు. అప్ప‌టికే ముఖ్య‌మంత్రి నిద్రించ‌టంతో శుక్ర‌వారం ఉద‌యాన్నే స్వయంగా చొర‌వ తీసుకుని వచ్చి భేటీ కావ‌టం విశేషం. బిల్ గేట్స్ చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంలో పదేళ్ల క్రితం నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.

       హీరో మోటార్ కార్ అధినేత‌లు ప‌వ‌న్ ముంజాల్‌, సునీత్ కాంత్ ముంజాల్ ఆహ్వానంతో  గురువారం రాత్రి  ఆ సంస్థ ఫెసిలిటీకి వెళ్లి డిన్న‌ర్‌కు ముఖ్య‌మంత్రి హాజ‌ర‌య్యారు. గూగుల్ సీఈవో  ఎరిక్ స్మిత్‌తో 30 నిమిషాల పాటు ముఖ్య‌మంత్రి భేటీ అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిజిట‌ల్ లిట‌ర‌సీకి స‌హ‌క‌రిస్తాన‌ని ఆయ‌న హామీనిచ్చారు.

       హార్వార్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోరియా కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ల‌సి మాట్లాడారు. ఏపీలో పెట్టుబ‌డుల‌కు వున్న అవ‌కాశాల గురించి, త‌మ విద్యాల‌యాన్ని సంద‌ర్శించే పారిశ్రామిక‌, వాణిజ్య ప్ర‌ముఖుల‌కు వివ‌రిస్తామ‌ని నోరియా హామీఇచ్చారు. ముందు నిర్ణ‌యించిన  షెడ్యూల్‌లో ఈ అపాయింట్‌మెంట్లు లేకున్నా ముఖ్య‌మంత్రి దావోస్ వ‌చ్చార‌ని తెలిసి అనేక‌మంది ప్ర‌ముఖులు ఆయ‌న‌తో భేటీ అయ్యేందుకు పోటీప‌డ‌టం విశేషం.

         వెల్‌స్ప‌న్ గ్రూపున‌కు చెందిన బి.గోయంకా, భార‌తి గ్రూప్ చైర్మ‌న్ సునిల్ మిట్ట‌ల్‌, జిఈ వైస్ చైర్మ‌న్ జాన్ రైస్ ల‌తో కూడా ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి స‌మావేశ‌మ‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌న‌రుల గురించి వివ‌రించి ఎంచుకున్న రంగాల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని వారిని ఆహ్వానించారు.

         దావోస్ ప‌ర్య‌ట‌న ఇచ్చిన స‌త్ఫ‌లితాల‌తో ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు, ఎంపీ సీఎం ర‌మేష్‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మౌలిక వ‌స‌తుల శాఖ ఉన్న‌తాధికారులు షంషేర్ సింగ్ రావ‌త్‌, అజ‌య్ జైన్ మ‌రో రోజు (శ‌నివారం) కూడా అక్క‌డే వుండి మ‌రికొంతమంది ప్ర‌ముఖుల‌ను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించారు. ఆర్ధికమంత్రి శ్రీ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు స‌హా బృందంలోని మిగిలిన స‌భ్యులు షెడ్యూల్ ప్ర‌కారం శుక్ర‌వారం రాత్రికి తిరుగు ప్ర‌యాణం కానున్నారు. ముఖ్యమంత్రి బృందం శ‌నివారం రాత్రి బ‌య‌లుదేరి ఆదివారం  హైద‌రాబాద్ చేరుకోనుంది.