ఏడాదిగా ఉగ్ర చెరలోనే..

బొకోహరామ్ చెరలో వందలాది బాలికల నిర్బంధం

స్కూలుకు వెళ్లిన పిల్లలు తిరిగి ఇల్లు చేరలేదు.. రోజులు, వారాలు, నెలలు గడిచాయి.. ఏడాది పూర్తైంది..  ఐనా వారి జాడ లేదు..   పిల్లలు క్షేమంగా ఉన్నారో లేదో కూడా తెలియని దుస్థితి..  నైజీరియా ఈశాన్య ప్రాంతం చిక్ బౌ పట్టణంలో బోకోహరామ్ ఉగ్రవాదుల దాష్టికానికి నిదర్శనమీ ఘటన.. 276 మంది బాలికలను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.. ఐతే అందులో కొంతమంది తప్పించుకోగా దాదాపు 200ల మంది బాలికలు వారి చెరలోనే మగ్గిపోతున్నారు.. కిడ్నాప్ జరిగి ఏడాది పూర్తవుతున్నా వారిని విడిపించడంలో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం సఫలం కాలేకపోయింది.. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు.. అంతర్జాతీయ సమాజం నుంచి విజ్ఞప్తులు వచ్చినా బొకోహరామ్ ఉగ్రవాదులు బాలికలను వదలకపోవడం గమనార్హం.

బొకోహరామ్ అంటే…
ప్రపంచం యావత్తూ మధ్యప్రాచ్యంలోని ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ సాగిస్తున్న దాష్టీకాలపై దృష్టిసారిస్తే నైజీరియాలో అంతకు మించిన దుర్మార్గచర్యలతో బోకోహరామ్ ఉగ్రవాదచర్యలను కొనసాగిస్తోంది. 2002లో పాశ్చాత్య విద్యావిధానానికి వ్యతిరేకంగా ఈ సంస్థను మహమ్మద్ యూసఫ్ నెలకొల్పాడు. ఈశాన్య నైజీరియా దీని పునాదులు బలంగా వున్నాయి. అల్‌ఖైదా స్ఫూర్తితో దీన్ని 2002లో స్థాపించారు. 2009 నుంచి ఈ సంస్థ ఉగ్రవాదదాడులను ప్రారంభించింది. ఇస్లామిక్ ఖలిఫా రాజ్యస్థాపనే లక్ష్యంగా హింసకు పాల్పడుతోంది. గత ఆరేళ్లుగా బోక్‌హరామ్ సాగించిన ఉగ్రవాదదాడుల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 లక్షలమంది జీవనవిధానంపై ఉగ్రవాదం ప్రభావం చూపింది. ప్రసుత్తం సంస్థకు అబూబకర్ షెకావు నేతృత్వం వహస్తున్నారు.