కామ్రేడ్ ను ఎత్తుకున్న డియర్ కరణ్….

విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఇప్పుడు తెలుగుతో పాటు మిగిలిన ఇండ‌స్ట్రీల్లో కూడా అదే ఇమేజ్ ఉంది. ఈయ‌న సినిమాల కోసం ఇతర భాషల ద‌ర్శ‌క నిర్మాత‌లు వేచి చూస్తున్నారు. ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ సినిమా విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతోంది. దీనికి ముందు విజయ్ న‌టించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఇప్పుడు గీత గోవిందం కూడా రాబోతుంది. ఇవ‌న్నీ రిలీజ్ అయిన త‌ర్వాత వెళ్లాయి. కానీ ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ సినిమా మాత్రం విడుద‌ల‌కు ముందే హిందీ రీమేక్ క‌న్ఫ‌ర్మ్ అయింది. ఈ సినిమాను నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదల చేస్తున్నారు. దీని ప్ర‌మోష‌న్స్ కూడా ఇదే స్థాయిలో జ‌రుగుతున్నాయి.

ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి స్టార్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తి చూపించాడు. ఇదే న్యూస్ క‌న్ఫ‌ర్మ్ కూడా చేసాడు డియ‌ర్ కామ్రేడ్ సినిమాను చూసాను.. అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న మెప్పించారు.. ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ కూడా మాయ చేసే స్క్రీన్ ప్లేతో అద‌ర‌గొట్టాడు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు చెప్పాడు. క‌ర‌ణ్ జోహార్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మైత్రి మూవీ మేక‌ర్స్ న‌వీన్, బిగ్ బెన్ సినిమాస్ య‌శ్ రంగినేని కలిసిన వారిలో ఉన్నారు. జులై 26న డియ‌ర్ కామ్రేడ్ సినిమా విడుద‌ల కానుంది. మ‌రి ఈ చిత్రం తెలుగులో ఎలా ఉండ‌బోతుందో.. హిందీలో ఎలాంటి మాయ చేయ‌బోతుందో చూడాలి.