బాలీవుడ్ లో చ‌రిత్ర‌కు చెద‌లు ప‌ట్టింది..

ఒక‌ప్పుడు హిస్టారిక‌ల్ మూవీస్ వ‌స్తున్నాయంటే ఆస‌క్తిగా చూసేవాళ్లు ప్రేక్ష‌కులు. తెలియ‌ని విష‌యాన్ని తెలుసుకుందాం.. దానికితోడు ఎంట‌ర్ టైన్ మెంట్ బోన‌స్ అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలంటేనే కిలోమీట‌ర్ దూరం వెళ్తున్నారు బాలీవుడ్ ప్రేక్ష‌కులు. దీనికి రీసెంట్ గా వ‌చ్చిన కొన్ని హై బ‌డ్జెట్ సినిమాల ఫ‌లితాలే నిద‌ర్శ‌నం. తాజాగా మిర్జియా అనే సినిమా ఎంత‌టి దారుణ‌మైన ఫ‌లితాన్ని చ‌విచూసిందో తెలిస్తే షాక్ అవుతారు. అనిల్ క‌పూర్ త‌న‌యుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. 70 కోట్ల భారీ బ‌డ్జెట్ తో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో రంగ్ దే బ‌సంతి ఫేమ్ రాకేష్ ఓం ప్ర‌కాశ్ మెహ్రా మిర్జియా సినిమా చేసాడు. మ‌గ‌ధీర త‌ర‌హాలో పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఇది. విడుద‌ల‌కు ముందు దీనికి భారీ హంగామానే చేసారు.

గ‌త వార‌మే మిర్జియా విడుద‌లైంది. అయితే ఈ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా క‌నీసం చాలా మందికి తెలియ‌దు. తొలి మూడ్రోజుల్లో క‌లిపి కేవ‌లం ఆరంటే ఆరే కోట్లు వ‌సూలు చేసింది మిర్జియా. 2000 థియేట‌ర్స్ కు పైగా విడుద‌ల చేయ‌డంతో బ‌య్య‌ర్ల‌కు భారీ గండి త‌ప్పేలా లేదు. హిస్టారిక‌ల్ బ్యాక్ డ్రాప్ ఉన్నా.. హీరోయిన్ల అందచందాలున్నా.. ప్రేక్ష‌కులు మాత్రం ఈ వారం కూడా ధోనీకే ఓటేసారు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన మొహింజ‌దారోకు ఇదే గ‌తి ప‌ట్టింది. 150 కోట్ల‌తో అశుతోష్ గోవారిక‌ర్ తెర‌కెక్కించిన ఈ సింధు దృశ్య‌కావ్యాన్ని తొలిరోజే తిప్పికొట్టారు ప్రేక్ష‌కులు. కేవ‌లం 50 కోట్లే వ‌సూలు చేసి.. బాలీవుడ్ లోని ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్ లో ఒక‌టిగా నిలిచింది మొహింజ‌దారో. గ‌తేడాది ర‌ణ్ బీర్ క‌పూర్ 120 కోట్ల బాంబే వెల్ వెట్ ప‌రిస్థితి ఇంతే. బ‌డ్జెట్ లో క‌నీసం నాలుగో వంతు కూడా వ‌సూలు చేయ‌లేదు బాంబే వెల్ వెట్. 1950ల్లో ముంబై ఎలా ఉండేద‌నే కథాంశంతో అనురాగ్ క‌శ్య‌ప్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. మొత్తానికి ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్ష‌కులు చ‌రిత్ర చెబితే చెంప చెల్లుమ‌నే స‌మాధానం ఇస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు.