సండ్ర విచార‌ణ రెండో రోజు కంటిన్యూ…చ‌ర్ల‌పల్లి జైలుకే

ఓటుకు నోటు కేసులో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. అనంతరం సండ్రను ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు సండ్రను తరలించనున్నారు. కేసుకు సంబంధించి కీల‌క స‌మాచారాన్ని ఆయ‌న నుంచి రాబ‌ట్టేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

రెండు రోజుల కస్టడీలో భాగంగా గురువారం నాడు సండ్రను ఏసీబీ విచారించిన విష‌యం విధిత‌మే! తొలిరోజు విచార‌ణ అనంత‌రం ఆయ‌న‌ను బ‌స నిమిత్తం సిట్ కార్యాల‌యానికి త‌ర‌లించారు. విచార‌ణ‌లో భాగంగా సెబాస్టియన్‌ను సండ్ర ఎదుట కూర్చోబెట్టి ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక సండ్ర కలవరానికి గురైయ్యార‌ని స‌మాచారం. " మొదటి నుంచి మీరిద్దరే వ్యూహం నడిపించారు.. ఇందులో అసలు కుట్రదారుడు ఎవరు? మీ ఫోన్ సంభాషణ నిజమైందే కదా! " అని ద‌ర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఐతే.. తన ఫోన్‌నుంచి సండ్రకు కాల్ చేసింది నిజమేనని తమ ఎదుట సెబాస్టియన్ ఒప్పుకున్నట్టు ఏసీబీలోని ఓ కీలక అధికారి వెల్లడించారు.