చంద్రబాబు వందరోజుల పాలనకు బంఫర్ గిఫ్ట్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వంద రోజుల పాలనకు ఓ బంఫర్‌గిఫ్ట్ లభించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన తొలి ఎన్నిక కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నిక. మంగళవారం వెలువడిన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. ఆమె తండ్రి తంగిరాల ప్రభాకర్‌రావు అక్కడ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణస్వీకారం చేయకుండానే మృతి చెందారు. దీంతో టీడీపీ అక్కడ ఆయన కుమార్తె సౌమ్యను బరిలో దించింది. వైకాపా ఇక్కడ నుంచి పోటీలో లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు బరిలో ఉన్నారు. మంగళవారం ఉదయం జరిగిన కౌంటింగ్‌లో మొత్తం 14 రౌండ్లలోను తెలుగుదేశం పూర్తి ఆధిక్యం కనపరిచింది. ఏదశలోను కాంగ్రెస్ తేదేపాకు పోటీ ఇవ్వలేకపోయింది. 

రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ చివరకు 74,827 ఓట్ల ఆధిక్యంతో తేదేపా అభ్యర్థి సౌమ్య ఘనవిజయం సాధించింది. మొత్తం 1,27,000 ఓట్లు పోలవ్వగా తేదేపా అభ్యర్థి సౌమ్యకు 99,748 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావుకు 24,921 ఓట్లు పోలవ్వడంతో డిపాజిట్ దక్కింది. విజయం సాధించిన తేదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ తన నాన్న పేరును నిలబెట్టేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ఈ విజయాన్ని దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకటరమణకు అంకితం ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అలాగే తనకు టిక్కెట్టు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాసేవ చేస్తానని ప్రకటించారు. అలాగే విజయవాడ రాజధానిగా ఎంపికచేసినందుకు, చంద్రబాబు వంద రోజుల పాలన ప్రదర్శనకు తన విజయం ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆమె అభివర్ణించారు.