తేదేపా రికార్డు – చంద్రబాబు ఖుషీ

తెలుగుదేశం పార్టీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. పార్టీ స్థాపించిన 30 ఏళ్లలో జరగని సంఘటన ఇప్పుడు జరగడంతో తేదేపాతో పాటు చంద్రబాబుకు కూడా జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు దక్కింది. వివరాల్లోకి వెళితే తేదేపాను జాతీయపార్టీగా విస్తరించే ఆలోచనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ సభ్యత్వ నమోదును ఏకంగా ఆరు రాష్ట్రాల్లో చేపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, మహారాష్ట్రలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లోను సభ్యత్వ నమోగు ప్రారంభించనున్నారు. ఇక్కడ పార్టీకి అజీజుర్ రెహ్మన్ అనే కౌన్సెలర్ కూడా ఉండడం విశేషం. అండమాన్‌లో పార్టీ కార్యాలయం భవనం నిర్మించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇందుకోసం అక్కడ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఒక లేఖ కూడా రాయనున్నారు. ఈ కార్యాలయం పూర్తయితే చంద్రబాబే స్వయంగా వెళ్లి దానిని ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

పలు రాష్ట్రాల్లో భారీగా సభ్యత్వ నమోదు:

పార్టీ స్థాపించిన మూడు దశాబ్దాల్లో ఒక్కసారిగా ఆరు రాష్ట్రాల్లో సభ్యత్వనమోదుతో పాటు పార్తీ విస్తరణ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరుగుతుండడంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నాట్టు టాక్. కర్ణాటకలో బెంగళూరు నుంచి షిమోగా వరకు ఉన్న నియోజకవర్గాల్లో తెలుగువారు భారీగా విస్తరించి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి యుడ్యారప్ప పలుసార్లు ప్రాథినిత్యం వహించిన శికారిపుర నియోజకవర్గంలో తెలుగు వారి ఓట్లు ఏకంగా 15 వేలు వరకు ఉన్నాయి. అలాగే అదే రాష్ట్రంలో బళ్లారిలో దాదాపు 40 శాతం మందితెలుగు వారు ఉన్నారు. షిక్‌బళ్లాపూర్, రాయచూర్, హోస్పేట, కోలార్, కొప్పల్ జిల్లాల్లో కూడా తెలుగు వారు భారీగా విస్తరించి ఉన్నారు. ఇప్పుడు వీరందరిని తేదేపాలో చేర్చేలా చంద్రబాబు పక్కా ప్రణాళికలతో పాటు వ్యూహం రచిస్తున్నారు.

అలాగే తమిళనాడులో చెన్నై, హోసూరు, కాంచీపురం, కృష్ణగిరి, కోయంబత్తూరు, తిరువళ్లూరు, ఒరిస్సాలోని బరంపురం, రాయఘడ్, పర్లాకిమిడి, గంజాం, గజపతి, జయపూర్ జిల్లాలు, మహారాష్ట్రలో నాసిక్, ముంబై తదితర ప్రాంతాల్లో తెలుగు వారు అధికంగా ఉన్నందున అక్కడ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ స్థాయిలో చేపట్టాలని పార్టీ అధినేత నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ బాధ్యతలను ఆయన తన తనయుడు లోకేష్‌కు అప్పగించనున్నారు. ఏదేమైనా తేదేపా జాతీయ పార్టీగా ఆవిర్భవించేందుకు చంద్రబాబు తగిన కసరత్తులు చేస్తూ పార్టీతో పాటు తాను కూడా అరుదైన గౌరవం పొందారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.