ఏపీ క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న…మార్పులు..చేర్పులు ఇవేనా

ఏపీ క్యాబినెట్ ను సీఎం చంద్ర‌బాబు ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నార‌ని, ఇందుకు సీఎం చంద్ర‌బాబు స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. జపాన్ ప‌ర్య‌ట‌న‌కు ముందే ఆంత‌రంగీకుల‌తో ఈ విష‌యాన్ని చెప్పార‌ని స‌మాచారం. ఇటీవ‌లే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు పూర్త‌యినందున, క్యాబినెట్‌లోకి సీనియ‌ర్ల‌ను ఆహ్వానించాల‌న్న‌ది బాబు యోచ‌న‌. ఇప్ప‌టికే చిన‌బాబు లోకేశ్ మంత్రుల ప‌నితీరుపై ఇంట‌ర్న‌ల్‌గా ఓ స‌ర్వే చేయించార‌ని, అందులో భాగంగా కొంద‌రి మంత్రుల ప‌నితీరు ఏమంత స‌మ‌ర్థంగా లేద‌ని తేలింద‌ని తెలుగు త‌మ్ముళ్ల మాట‌.

అంతేకాక పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ‌తో మొద‌లుకొని త‌మిళ‌నాడు వ‌ర‌కూ కొన్ని కీల‌క అంశాల‌పై ఎడ‌తెగ‌ని పంచాయ‌తీ ఉన్నందున, ముఖ్య విష‌యాల‌పై మాట్లాడేందుకు, స‌బ్జెక్టివ్‌గా వాయిస్ వినిపించేందుకు సోమిరెడ్డి, ప‌య్యావుల, గాలి వంటి వారే క‌రెక్ట్ అన్న‌ది బాబు అభిప్రాయం. స‌రిగా ప‌నిచేయ‌ని మంత్రుల‌ను కొన‌సాగించే క‌న్నా వారిని ఇంటికి పంప‌డ‌మే మేల‌న్న యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నారు.

ఈ క్ర‌మంలో ప‌నితీరు అంత‌గా లేద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న‌ పీతల సుజాత‌, రావెల కిశోర్ బాబు, కొల్లు ర‌వీంద్ర‌, ప‌ల్లె రఘునాథ్‌రెడ్డి, కిమిడి మృణాళినితో స‌హా డిప్యూటీ సీఎంలు నిమ్మ‌కాయ‌ల చిన్న‌రాజ‌ప్ప‌, కేఈ కృష్ణ‌మూర్తిలో కొంద‌రిపై వేటు ఖాయంగా క‌నిపిస్తోంది. కీల‌క స‌మయాల్లో నిమ్మ‌కాయ‌ల‌, కేఈ ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచి, మీడియా ఎదుట వాయిస్ వినిపించ‌లేక‌పోతున్నార‌న్న‌టాక్ బ‌లంగా వ‌స్తోంది.

అదేవిధంగా మైనార్టీ నేత‌, ఇటీవ‌ల ఎమ్మెల్సీగా ఎన్నికైన ష‌రీఫ్‌ను సైతం క్యాబినెట్ లో తీసుకుని, ఆయ‌న‌కు మైనార్టీ శాఖ‌ను అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ మినిస్ట‌ర్ హోదాలో ఉన్న విప్ కూన ర‌విని సైతం మంత్రివ‌ర్గంలో తీసుకోవాల‌ని, ప‌య్యావుల‌, సోమిరెడ్డి వంటి వారికి కీల‌క శాఖ‌లు అప్ప‌గించి, పాల‌నను వేగ‌వంతం చేయాల‌ని టీడీపీ అధినాయ‌క‌త్వం ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తోంది.