పంతం నెగ్గించుకున్న సిఎం చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పంతం నెగ్గించుకున్నాడు. ఏపీ రాజధాని ఏర్పాటుపై గత నాలుగు నెలలుగా వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించనున్నాడు. సోమవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు రాజధానిపై ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ-గుంటూరు నగరాల మధ్యే రాజధాని ఉంటుందని అయితే ఈ విషయమై తాను స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేస్తానని ఎవ్వరూ బయటకు వెల్లడించ వద్దని ఆయన అన్నట్టు సమాచారం. రాజధానిని చంద్రబాబు స్వయంగా మంగళవారం అసెంబ్లీలో ప్రకటించనున్నారు. అయితే విజయవాడ-గుంటూరు నగరాల మధ్య భూసేకరణ చాలా కష్టంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా మంత్రివర్గ సమావేశంలో వ్యక్తమైనట్టు సమాచారం. ఇందుకోసం విజయవాడ-గుంటూరు జిల్లాల మంత్రులైన దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుతో ఓ కమిటీని నియమించారు. తర్వాత ఈ కమిటీలో మంత్రి అచ్చెన్నాయుడు పేరు కూడా చేర్చినట్టు సమాచారం. 

ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధాని ఏర్పాటుకు పలు సూచనలు చేసింది. రాజధాని ఏర్పాటుకు రాష్ట్రాన్ని మూడు జోన్లు చేయాలని కూడా తెలిపింది. దొనకొండ వద్ద వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నందున అక్కడైతే రాజధాని ఏర్పాటు అనువైందిగా కూడా కమిటీ చెప్పింది. అయితే విజయవాడ-గుంటూరు నగరాల మధ్య రైతులు భూములు అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో లేకుండా ప్రభుత్వ, అటవీ భూములు అధికంగా ఉన్న కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. నూజివీడు వద్ద సుమారు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు చంద్రబాబు మంత్రులకు చెప్పినట్టు సమాచారం. అయితే హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇలా అన్ని ఒక్కచోటే ఉండాలన్న అభిప్రాయం మంత్రులందరూ వ్యక్తం చేశారు. మంత్రులు పనుల కోసం వస్తే అన్ని ఒకేచోట ఉంటే వారి పనులు చక్కపెట్టుకోవడం కుదురుతుందని అందువల్ల పరిపాలన కేంద్రీకృతమయ్యేలా రాజధాని ఏర్పాటు చేయాలంటున్నారు. ఏదేమైనా రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు తాను ముందునుంచి అనుకున్నట్టుగానే విజయవాడ-గుంటూరు నగరాల మధ్యే ఏర్పాటు చేస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది