సంక్రాంతి వేడుకలకు ప్రతి జిల్లాకు రూ. కోటి నిధులు – ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి జిల్లా కలెక్టర్లు. ఇతర అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతి వేడుకల నిర్వహణకు గత ఏడాదిలానే ఈ పర్యాయం జిల్లాకు రూ. కోటి విడుదల చేస్తామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వేడుకల నిర్వహణకు ఈ నిధులు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమానికి ప్రజా స్పందనపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. కడప జిల్లా పర్యటన అనుభవాలను సీఎం కలెక్టర్లకు వివరించారు. ప్రభుత్వం ఏదో ఇస్తుందని కాకుండా, జన్మభూమి సభలకు హాజరవుతున్న ప్రజలు..తమ తమ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారని, అవే విషయాల మీద చర్చించుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామాలలో ఈ సరికొత్త మార్పును తాను గమనించానని వివరించారు.

విద్యారంగంపై మాట్లాడుతూ..ఒక జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటి, మెడికల్ కళాశాలల అభివృద్ధి అనేక అంశాలతో ముడిపడి ఉందని చెప్పారు. అధికార యంత్రాంగం చక్కని సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇంజనీరింగ్, ఐటి, మెడికల్ ఐటి విద్యలో రాష్ట్రం ఆశాజనకమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి ప్రణాళిక అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ విధానాన్ని బెస్ట్ ప్రాక్టీస్‌గా తీసుకుని మిగిలిన జిల్లాలలో అమలు చేయాలని కోరారు.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో విద్యార్ధులు మంచినీటిని పీల్చే టైల్స్‌ను తయారు చేశారని, వారి నైపుణ్యాలను మార్కెటింగ్ చేస్తే సత్ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ఈ విధానం ద్వారా భూగర్భజలాల నిల్వలు పెంచవచ్చని వివరించారు. జలసంరక్షణ పద్ధతులలో ఈ విధానంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు.

ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లాలోని 53 మండలాల్లో మండలానికి ఒక్కొక్క పాఠశాలను మోడల్ గా తీసుకుని మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ తెలిపారు. మరుగుదొడ్ల ఏర్పాటు ఆవశ్యకత, పారిశుధ్యంపై ప్రజాచైతన్యం తేవటానికి విద్యార్ధులతో కమిటీలు వేస్తామని చెప్పారు. సీఎం స్పందిస్తూ.. ఇది చాలా మంచి ఆలోచన అని, అన్ని జిల్లాలలో అమలు చేయాలని కోరారు. వేసవి సెలవులలో 9,10 తరగతుల పిల్లలకు రెండు వారాలపాటు ఈ దిశలో శిక్షణ శిబిరాలను నిర్వహించాలని సీఎం సూచించారు. ఇలా శిక్షణ పొందినవారు ‘స్వచ్ఛఆంధ్ర’ పై ప్రజల్లో చైతన్యం తెస్తారని సీఎం అన్నారు.