చంద్రిక పోస్టర్ రిలీజ్

సంచలన విజయం సాధించిన ‘చంద్రముఖి’ తరహాలో రూపొందుతున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ ‘చంద్రిక’. తెలుగు`కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌’ పతాకంపై శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్నారు. కార్తీక్‌ జయరామ్‌, కామ్నజెత్మలాని, శ్రీముఖి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ‘యోగేష్‌ మునిసిద్దప్ప’ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఓ కొత్త జంట ఎంతో అన్యోన్యంగా నివసించే ఓ భవనంలో జరిగే అనూహ్య సంఘటనల సమాహారంగా, సరికొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కుతున్న ‘చంద్రిక’ ప్రచార చిత్రాన్ని ఇటీవల ‘యూట్యూబ్‌’లో నేరుగా విడుదల చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షకుపైగా వ్యూస్‌ సాధించడం ద్వారా ఈ చిత్రం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.

ఈ సందర్భంగా ‘ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌’ అధినేత్రి వి.ఆశ మాట్లాడుతూ.. ‘‘భారతీయ సినిమా చర్రితలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన ‘చంద్రముఖి’ని తలపించేలా.. ‘చంద్రిక’ చిత్రాన్ని మా దర్శకుడు యోగేష్‌ మునిసిద్దప్ప ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. హీరో కార్తీక్‌ జయరామ్‌, హీరోయిన్లు కామ్మజెత్మలాని, శ్రీముఖి ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. ఇక గిరీష్‌ కర్నాడ్‌ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేముంది? గ్రాఫిక్స్‌ వర్క్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. యు ట్యూబ్‌లో రిలీజ్‌ చేసిన ట్రయిలర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

చిత్ర దర్శకుడు యోగేష్‌ మునిసిద్దప్ప మాట్లాడుతూ.. ‘‘సాజిద్‌ ఖురేషి సమకూర్చిన కథ`స్క్రీన్‌ప్లే ‘చంద్రిక’ చిత్రానికి ప్రధాన ఆయువుపట్టు. ‘చంద్రముఖి’లా చిరకాలం గుర్తుండిపోయేంత గొప్పగా.. గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తూ రూపొందుతున్న ‘చంద్రిక’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండడం చాలా గర్వంగా ఉంది’ అన్నారు.

గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, తాగుబోతు రమేష్‌, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: నాగు, ఎడిటింగ్‌: వి.సురేష్‌కుమార్‌, కెమెరా: కె.రాజేంద్రబాబు, యాక్షన్‌: థ్రిల్లర్‌ మంజు, మ్యూజిక్‌: గున్వంత్‌, నిర్మాత: శ్రీమతి వి.ఆశ, కథ`స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, దర్శకత్వం: యోగేష్‌ మునిసిద్దప్ప!!