ఖైది నంబర్ 150 కోసం హడావిడి మాములుగా లేదుగా…

ఏ హీరో బ‌ర్త్ డే అయినా ఉంటే.. ఇంట్లో వాళ్లు సెలెబ్రేట్ చేసుకుంటారు.. అభిమానులు పండ‌గ‌ చేసుకుంటారు. ఇంకాస్త ఎక్కువ ప్రేముంటే అన్న‌దాన‌మో.. ర‌క్త‌దాన‌మో చేస్తారు. కానీ ఇక్క‌డ చిరంజీవి అభిమానులు మాత్రం కాస్త ఎక్కువే చేస్తున్నారు. వాళ్ల‌కు తోడు కుటుంబ స‌భ్యులు కూడా చాలా విచిత్రాలు చేస్తున్నారు. మెగా హీరోలంతా మెగాస్టార్ బ‌ర్త్ డే ను చాలా భిన్నంగా సెలెబ్రేట్ చేస్తున్నారు. గ‌తేడాది చిరంజీవి బ‌ర్త్ డేను అభిమానులు న‌వ‌రాత్రుల త‌ర‌హాలో జ‌రిపారు. ఇప్పుడు కూడా మెగా హీరోలు ఓ కొత్త పద్ద‌తి ఫాలో అవుతున్నారు.

ఆగ‌స్ట్ 22న చిరంజీవి పుట్టిన‌రోజు. అంత‌లోపే ఒక్కో హీరో.. ఒక్కో గుడి వెళ్లి ద‌ర్శ‌నం చేసుకుని వ‌స్తున్నాడు. ఇందులో నిహారిక కూడా ఉండ‌టం విశేషం. ఆగ‌స్ట్ 14 నుంచి 22 వ‌ర‌కు తొమ్మిది రోజులు తొమ్మిది గుళ్ల‌కు వెళ్తున్నారు మెగా హీరోలు. కాణిపాకం, విజ‌య‌వాడ‌, సికింద్రాబాద్, అంత‌ర్వేది, శ్రీ‌కాకుళం, వైజాగ్, జంగారెడ్డి గూడెం, హైద్రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ గుడి.. ఇలా అన్ని గుళ్ళ‌లో చిరు పేరిట ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. ఇప్ప‌టికే అంత‌ర్వేదిలో సాయిధ‌రంతేజ్ మేన‌మామ పేరిట పూజ చేయించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఎప్ప‌ట్లాగే త‌న మౌనాన్ని కంటిన్యూ చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఇది చాల‌ద‌న్న‌ట్లు ఫ‌స్ట్ లుక్ హ‌డావిడి కూడా మామూలుగా లేదు. చిరంజీవి పుట్టిన‌రోజు నాడు ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌ను ఆడియో ఫంక్ష‌న్ కంటే ఘ‌నంగా జ‌ర‌ప‌బోతున్నారు. అభిమానుల స‌మ‌క్షంలో ప‌దేళ్ల కింద చిరంజీవి ఎలా బ‌ర్త్ డే జ‌రుపుకునే వాళ్లో అలా ఇప్పుడు చేసుకోనున్నాడు. అంతేకాదు.. టీజ‌ర్ లాంచ్ కోసం అంతా బైట్స్ కూడా ఇచ్చారు. మొత్తానికి మెగా హ‌డావిడి చూస్తుంటే క‌ళ్ళు బైర్లు గ‌మ్మ‌డం గ్యారెంటీ. చూడాలి మ‌రి.. రేపు సినిమా కూడా ఇంతే హంగామా చేస్తుందో లేదో..?