రెంటికీ చెడ్డ రేవ‌డిలా మారిన చిరు..

చిరంజీవి.. ఈ పేరుకు ఒకప్పుడు ఉన్న డిమాండ్ వేరు, క్రేజ్ వేరు. మెగాస్టార్ అనే పేరు వింటే అభిమానుల ఒంట్లో క‌రెంట్ పాస్ అయ్యేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కాలంతో పాటే ఆయ‌న క్రేజ్ కూడా మంట గ‌లిసిపోయింది. దీనికి ఆయ‌న చేసిన స్వ‌యంకృత‌మే కార‌ణం. సినిమాల్లో మెగాస్టార్ గా ఏక‌చ‌త్రాధిప‌త్యం కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అతిపెద్ద త‌ప్పు చేసారు చిరంజీవి. ప్ర‌జారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డం.. త‌ర్వాత కాంగ్రెస్ లో ఆ పార్టీని విలీనం చేయ‌డం ఇవ‌న్నీ మెగాస్టార్ కు ప్ర‌తికూలంగా మారిపోయాయి. ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్లు రాష్ట్ర విభ‌జ‌న కూడా చిరుకి వ్య‌తిరేకంగానే మారింది.

ఏదో ఓ స్టాండ్ తీసుకోవాల‌నే తొంద‌ర్లో స‌మైఖ్యాంద్ర అంటూ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శ‌త్రువు అయ్యాడు చిరంజీవి. ఇక ఇప్పుడు రాజ‌కీయాల ప‌రంగా చిరంజీవి ప్ర‌స్థానంలో ఓ స్థ‌బ్ధ‌త వ‌చ్చింది. ఏం చేయాలో తెలియ‌ని డైల‌మాలో ఉన్నానని త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చిరు వాపోతున్నారట‌. అన‌వ‌స‌రంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చానేమో అనే ఊహల్లో కూడా ఉన్నాడ‌ట చిరంజీవి. మెగాస్టార్ ను ఈ స్థితిలో చూసి కాంగ్రెస్ పెద్ద‌లే కాస్త స‌ముదాయిస్తున్నార‌ని వినికిడి. వ‌చ్చేసారి స్టేట్ లో కాక‌పోయినా.. సెంట్ర‌ల్ లో అయినా కాంగ్రెస్ వ‌స్తుంద‌ని.. అప్పుడు మీకు స‌ముచిత స్థానం క‌ల్పిస్థామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ ఖాళీ టైమ్ లో సినిమా చేద్దామ‌ని భావించినా.. ఈ ప‌నులు కూడా మ‌రుగున ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తున్నాయి. బ్రూస్ లీ లో కాసేపు క‌నిపించినా.. ప్రేక్ష‌కుల నుంచి మెగాస్టార్ ఆశించినంత స్పంద‌న రాలేదు. దాంతో సినిమా చేయ‌డానికి కూడా చిరంజీవి ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం. మొత్తానికి ఓ వైపు రాజ‌కీయాల్లో ఫెయిల్యూర్.. మ‌రోవైపు అచ్చొచ్చిన సినిమా రంగంలోనూ ఎదురుదెబ్బ‌లు.. ఏం చేయాలో తెలియని స్థితిలో ప‌డిపోయారు మెగాస్టార్. మ‌రి ఈ డైల‌మా నుంచి చిరంజీవి బ‌య‌టికి వ‌చ్చేది ఏ నాటికో..!