150 కోసం చిరంజీవి రాజకీయాలు వదిలేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో అంతగా సక్సెస్ కాలేదు. అందుకే చిరంజీవి 150 సినిమా తొందర్లోనే ప్రారంభమౌతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిపి మంత్రి పదవి అలంకరించిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ ఉన్నంతవరకు అభిమానులు ఆయన వెంటే ఉన్నారు. కానీ కాంగ్రెస్ లో కలపడం అభిమానులు జీర్ణించుకోలేదు. ఇది ఓ దెబ్బ అయితే.. ఇంటి సమస్యలు అధికమయ్యాయి. పవన్ కళ్యాణ్ తో విభేదాలు బహిరంగం కావడం పెద్ద సమస్యగా మారింది. మీడియా చిరు ఫ్యామిలీని ఉతికి ఆరేసింది. ఇక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం చిరు పనిచేస్తున్న కాంగ్రెస్ ను చీల్చి చండాడడం మోడీ చంద్రబాబుకు మద్దతు తెలపడం చిరుకు నిద్రపట్టనీయకుండా చేసింది. దీంతో పాటు మెగాభిమానులు సైతం చీలిపోయారు. పవన్ వర్గం ఓ వైపు చిరు వర్గం ఓ వైపు అయ్యారు. అంతేకాకుండా కాంగ్రెస్ పరిస్థితి సీమాంధ్రలో మరీ దయనీయంగా మారింది. సీట్లు గెలుచుకోవడం దేవుడెరుగు కనీసం డిపాజిట్లు దక్కించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీలో ఉండడం చిరు సహించలేడు. అందుకే చిరు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి మళ్లీ సినిమాలు చేసుకుంటాడనే టాక్ వినిపిస్తోంది. 

చిరంజీవి 150వ సినిమా ఎప్పుడనేది అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. చిరు రాజకీయాలు వదిలిపెట్టి సినిమాలు చేస్తే మంచిదని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు. చిరు మనసులో కూడా ఏమూలో ఎందుకొచ్చిన రాజకీయాల్రా అనిపిస్తుండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. చిరు 150వ సినిమాకు తనయుడు రాంచరణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని రాంచరణే నిర్మించనున్నారు. అందుకే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారట. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. 

అయితే 150వ సినిమా కోసం చిరు రాజకీయాలు పూర్తిగా వదిలేస్తాడా లేక రాజకీయాల్లో ఉంటూనే 150వ సినిమా చేస్తాడా అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.