ముందు అవునంటారు.. తర్వాత కాదంటారు.. అప్పుడు నో అంటారు.. ఇప్పుడు ఎస్ అంటున్నారు.. చిరంజీవి సినిమా అంటే కామెడీ మాదిరి మారిపోయింది ఇప్పుడు. ఎవ్వరూ ఓ మాటపై నిలబడటం లేదు. తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి నటించబోయే సినిమా అంటే ఎలా ఉండాలి..? కానీ మెగాస్టార్ సినిమా విషయంలో మాత్రం ఏదో తేడా జరుగుతుంది.. ఎక్కడో విషయం తేడాగా ఉంది.. ఏదీ కన్ఫర్మ్ గా చెప్పట్లేదు.. ఏదీ క్లారిటీగా చేయట్లేదు. హీరోయిన్.. విలన్.. కమెడియన్.. టైటిల్.. ఇలా ప్రతీ విషయంలోనూ అభిమానుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు చిరంజీవి.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ఎవరు నటిస్తారో అనే విషయంపై చాన్నాళ్లకు చర్చ నడుస్తూనే ఉంది. చివరికి ఆ ఛాన్స్ కాజల్ ఎగరేసుకుపోయింది. కొడుకుతో నటించిన ముద్దుగుమ్మనే తనకు కూడా జోడీగా ఎంచుకున్నాడు చిరంజీవి. ఈ ఏడాదే పవన్ కళ్యాణ్ తో సర్దార్ లో నటించిన కాజల్.. అప్పుడే అన్నయ్యతో నటించే అరుదైన అవకాశాన్ని అందుకుంది. మొన్నటి వరకు కాజల్ వద్దన్నారనే టాక్ వినిపించింది.. ఇక టైటిల్ విషయంలోనూ ఇదే రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమాకు కత్తిలాంటోడు వద్దన్న చరణే.. ఇప్పుడు ఇదే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిష్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది.
విలన్ విషయంలోనూ ఇప్పటికీ సస్పెన్స్ వీడలేదు. వివేక్ ఒబేరాయ్, జగపతిబాబు.. ఇలా చాలా మందిని అనుకున్న తర్వాత ఇప్పుడు తరుణ్ అరోరా దగ్గరికి వచ్చి ఆగింది గేమ్. ఈయన చిరంజీవి మాజీ హీరోయిన్ అంజలా జవేరి భర్త. కత్తిలాంటోడులో ఈయనే విలన్ గా నటించబోతున్నాడు. చిరంజీవికి ఇంకాస్త ధీటైన విలన్ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నారు అభిమానులు. కానీ మెగాస్టార్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. మొత్తానికి మెగా మూవీతో ఇష్టమొచ్చినట్లు గేమ్ ఆడేస్తున్నాడు మెగాస్టార్.