చిత్రలహరి మూవీ రివ్యూ….

చిత్రలహరి మూవీ రివ్యూ….

సాయి ధరమ్ తేజ్ వరుసగా ఆరు ఫ్లాపులు రుచి చూశాడు. ఏడో చిత్రంగా చిత్ర లహరి సినిమా చేశాడు. ఈసారి తన రెగ్యులర్ ఫార్మాట్ ఫైట్లు, పాటలు, రివెంజ్ డ్రామా కాకుండా… లవ్ ఎమోషనల్, మోటివేషనల్ సినిమాలు తీసే కిషోర్ తిరుమలను దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దేవిశ్రీ పాటలు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. మంచి చిత్రాలు తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణి ప్రియదర్శిని, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. వరుస ఆరు పరాజయాల తర్వాత వస్తున్న ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కు చాలా ఇంపార్టెంట్. మరి ఈ సినిమాతో సాయి విజయం అందుకున్నాడా లేదా అన్నది చూద్దాం.

కథేంటంటే….
విజయ్ కృష్ణ (సాయి తేజ్) ఓ ప్రాజెక్ట్ రెడీ చేసి దాని అప్రూవల్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. ఈ గ్యాప్ లో టీవీ రిపేరింగ్ సెంటర్ లో వర్క్ చేస్తుంటాడు. అదే సమయంలో లహరిని (కళ్యాణి ప్రియదర్శిని) చూసి ఇష్టపడతాడు. ఇంప్రెస్ చేసి ప్రేమను సంపాదిస్తాడు. ఇద్దరూ బాగున్న టైంలో స్వేచ్ఛ (నివేద థామస్) చెప్పే కొన్ని మాటలతో లహరి విజయ్ కి బ్రేకప్ చెబుతుంది. లవ్ లో, లైఫ్ లో ఫెయిల్ అయ్యాననే బాధ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో స్వేచ్ఛ ద్వారా ఓ ప్రాజెక్ట్ ఓకే చేయించుకునేందుకు ముంబై వెళ్తారు. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఓకే అవ్వదు. దీంతో జీవితమే లేదు అని అనుకుంటాడు. అప్పుడే మళ్లీ తన లైఫ్ లోకి లహరి వస్తుంది. తన ప్రాజెక్ట్ ఓకే చేసేందుకు ఓ ప్లాన్ చేస్తాడు. అది కోర్ట్ వరకు వెళ్తుంది. ఇంతకూ లహరి విజయ్ ను ఎందుకు కాదన్నది. తమ ప్రేమకు అడ్డొచ్చిన స్వేచ్ఛతో విజయ్ ఎందుకు ట్రావెల్ అయ్యాడు. తన ప్రాజెక్ట్ ను ప్రూవ్ చేసుకునేందుకు విజయ్ ఏం చేశాడు. కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది. లహరి మళ్లీ తన జీవితంలోకి ఎలా వచ్చింది. ఈ విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

సమీక్ష
సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఈ తరహా పాత్ర చేయలేదు. ఈ తరహా జోనర్ సినిమా కూడా చేయలేదు. కొత్త పాత్రలో కొత్త కథలో, కొత్త బాడీ లాంగ్వేజ్ లో సాయి ధరమ్ తేజ్ ఒదిగిపోయాడు. భారీ యాక్షన్లు, ఛేజ్ లు, సెట్టింగులు లాంటివి ఉండే కథ కాదు కాబట్టి. తనకు తాను మార్చుకున్నాడు. డైరెక్టర్ కిషోర్ తిరుమల కథలోకి హీరోను తీసుకురాగలిగాడు. సినిమా స్లో నరేషన్ తో ఉంటుంది. కాస్త ఓపికతో చూడాలి. సక్సెస్ కు ఎంత ఓపిక కావాలో ఈ సినిమా చూడటానికి కూడా కాస్త ఓపిక కావాల్సిందే. కథ, కథనం అలాంటిది. ఇందులోని క్యారెక్టర్స్ మనకు కొత్త కాదు. వేరే సినిమాల్లోనూ ఈ తరహా పాత్రల్ని మనం చూసే ఉంటాం. కానీ దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే, సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. పోసాని పాత్రను బాగా తీర్చి దిద్దాడు. సినిమా అంతా మోటివేషనల్ గా ఉంటుంది. హీరో ఫెయిల్యూర్స్ లో ఉంటాడు. తండ్రి, స్నేహితులు, లవర్ సమాజం ఇలా అందరూ మోటివేట్ చేస్తూనే ఉంటారు. అయినా చివరి వరకు రిజెక్టెడ్ పీస్ లాగే ఉంటాడు హీరో. అదే సమయంలో తాను ఎంచుకున్న మార్గంలో సక్సెస్ సాధిస్తాడు అదే కథ.

దర్శకుడు కిషోర్ తిరుమల సినిమాలు ఇదే స్లో ఫేజ్ నరేషన్ తో ఉంటాయి. ఎందుకంటే అతను ఎంచుకునే కథలు అలాంటివి. అదే సమయంలో డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నాడు. ఆ డైలాగ్స్ కూడా సమయాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి బాగా కుదిరాయి. హీరోయిన్ కళ్యాణి పాత్ర బాగుంది. రెగ్యులర్ గా ఈ తరహా అమ్మాయిలు మనకు కనిపిస్తారు. అలాగే నివేదా పాత్ర కూడా పూర్తి నెగెటివ్ గా సాగే పాత్ర. ఇక సునీల్ చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో కనిపించాడు. నవ్వించగలిగాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పోసాని క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. రావ్ రమేశ్ కొద్దిసేపే ఉన్నా బాగుంది. బ్రహ్మాజీ నెగెటివ్ పాత్రలో కనిపించాడు. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ నవ్వించాడు. మిగిలిన పాత్ర ధారులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

అయితే ఈ సినిమాకు ఒక్కటే ప్రాబ్లం. ఈ సినిమా జనాలకు కొత్తేం కాదు. ఈ తరహాలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అందుకే బాలేదు అనలేరు. అద్భుతం అని కూడా అనలేరు. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ మాత్రం మిగులుతుంది. అదే మాదిరిగా సాయి ధరమ్ కెరీర్ లో ఓ మంచి చిత్రంగా మిగులుతుంది. గత ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వాటితో పోల్చితే ఇది చాలా మంచి సినిమా ఇది. లవ్, కెరీర్ మధ్య సాగే చిత్రం ఇది. అమ్మాయిలు ప్రేమను అర్థం చేసుకునే తీరును, సమాజం ఫెయిల్యూర్స్ ని, సక్సెస్ ను తీసుకునే తీరును దర్శకుడు బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. టెక్నికల్ గా దేవిశ్రీ సాంగ్స్, రీ రికార్డింగ్ బాగుంది. కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా డైలాగ్స్ ఈసినిమాకు ప్రాణంగా నిలిచాయి. స్టోరీ బేస్ డ్ సినిమా కాబట్టి డైలాగ్స్ చాలా కీలకం. దర్శకుడు ఆ విషయంలో ఫుల్ ఎఫర్ట్ పెట్టగలిగాడు.

ఓవరాల్ గా.. సాయికి మంచి చిత్రంగా చిత్ర లహరి మిగులుతుంది. లవ్ ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే క్లాస్ ఆడియెన్స్ కి బాగా నచ్చుతుంది. మాస్ హీరో సాయి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.

Rating : 3.25/5