ఈ ద‌స‌రా విన్న‌ర్ ఎవ‌రో తెలుసా..?

ఎప్పుడూ లేని విధంగా ఈ ద‌స‌రా పండ‌క్కి ఏకంగా ఐదు సినిమాలు వ‌చ్చాయి. పెద్ద హీరోలు చిన్న‌చూపు చూసినా.. చిన్న హీరోలు మాత్రం పెద్ద పండ‌క్కి వ‌చ్చారు. ఈ సెల‌వుల సీజ‌న్ లో ఐదు సినిమాలు వేటికి త‌గ్గ‌ట్లే అవి బాగానే వ‌సూలు చేసాయి. ఈ ద‌స‌రా సీజ‌న్ లో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా ప్రేమ‌మ్. మ‌ళ‌యాల బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రేమ‌మ్ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా నాగ‌చైత‌న్య కెరీర్ లోనూ బిగ్గెస్ట్ హిట్ దిశ‌గా అడుగేస్తుంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ సంపాదించిన ప్రేమ‌మ్.. తెలుగులోనూ అద్భుత‌మైన వ‌సూళ్ళు సాధిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే 9 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన ప్రేమ‌మ్.. వీకెండ్ మొత్తంలో 14 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టింది. ఇప్ప‌టికీ స్ట్రాంగ్ గానే ఉన్నాయి ప్రేమ‌మ్ వ‌సూళ్లు. యూత్ కు బాగా క‌నెక్టవ్వ‌డం ప్రేమ‌మ్ కు క‌లిసొచ్చే అంశం.

ఇక సునీల్ ఈడు గోల్డ్ ఎహే తొలిరోజు ఓకే అనిపించింది గానీ రెండో రోజు నుంచే డౌన్ అయింది. యావ‌రేజ్ టాక్ కు తోడు పోటీ భారీగా ఉండ‌టంతో సునీల్ కాస్త త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. బి, సి సెంట‌ర్స్ లో ఈడు గోల్డ్ ఎహే ప‌ర్లేద‌నిపించే స్థాయిలో వ‌సూళ్లు రాబ‌డుతోంది. అభినేత్రి హార్ర‌ర్ కామెడీగా బి, సి ల్లో బాగానే వెన‌కేస్తోంది. కోన‌వెంక‌ట్ ఈ సినిమాను కేవ‌లం 6 కోట్ల‌కే కొన‌డంతో సేఫ్ అయ్యే సూచ‌న‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. జాగ్వార్ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. ఇక ప్ర‌కాశ్ రాజ్ కూడా మ‌నఊరి రామాయ‌ణంతో మ‌రోసారి ప్ర‌శంస‌ల వర‌కే ప‌రిమితం అయ్యాడు. మొత్తానికి ఈ సీజ‌న్ లో ప్రేమ‌మ్ కే ప‌ట్టం క‌ట్టారు ప్రేక్ష‌కులు.