చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కామ్రేడ్స్

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమా నిర్మాతలు చేసిన పని. ముందు ఈ చిత్రాన్ని చూసుకుని మూడు గంటలు వచ్చిన తర్వాత కూడా పర్లేదని విడుదల చేసారు. స్లో ఉందని తెలిసినా కూడా అలాగే రిలీజ్ చేసారు. విజయ్ దేవరకొండ క్రేజ్ పై నమ్మకంతో చూస్తారులే అని నమ్మకంగా ఉన్నారు నిర్మాతలు. కానీ సినిమా బాగోలేనపుడు పవన్ కళ్యాణ్ ఉన్నా పట్టించుకోరు ప్రేక్షకులు. అలాంటి విజయ్ దేవరకొండ సినిమా అయితే ఏంటి వాళ్లకు..? ఇప్పుడు ఇదే జరిగింది. డియర్ కామ్రేడ్ సినిమాకు తొలిరోజే టాక్ తేడాగా వచ్చేసింది. కలెక్షన్స్ పర్లేదు అనిపించినా కూడా ఇప్పట్నుంచి అసలు సినిమా కనిపించనుంది. అందుకే మూడు గంటల సినిమాను కాస్తా ఇప్పుడు కోత పెట్టారు. 13 నిమిషాలు కట్ చేసి వదిలేసారు. ఇప్పుడు తమ కామ్రేడ్ మరింత కొత్తగా ఉంటాడని.. ఫాస్టుగా వెళ్తాడంటున్నారు నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమా భవిష్యత్తును మార్చడం అయితే కష్టమే కానీ కలెక్షన్లలో ఏమైనా తేడా తీసుకొస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఏరియాల్లో సినిమా స్లో అయిపోయింది. ఇస్మార్ట్ శంకర్ ఇంకా నడుస్తున్నా కూడా డియర్ కామ్రేడ్ మాత్రం చల్లబడిపోయింది. దానికి కారణం సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్. చిన్న టౌన్స్ లో సినిమా కలెక్షన్లు భారీగా వెనకబడిపోయాయి. సిటీస్ లో ఇంకా విజయ్ మేనియా ఉంది కాబట్టి కొద్దోగొప్పో నెట్టుకొస్తున్నాడు డియర్ కామ్రేడ్. ట్రిమ్ చేసిన తర్వాత కూడా ఫలితం అయితే మారేలా కనిపించడం లేదు.